శ్రీశైల దేవస్థానం:శ్రావణ శుద్ధ పాడ్యమి, జూలై 29వ తేదీ నుండి శ్రావణ అమావాస్య ఆగస్టు 27 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి గురువారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా కార్యాలయం లోని సమావేశ మందిరములో ఈ సమీక్ష జరిగింది. ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు), సీనియర్ వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఆయా విభాగాల వారిగా చేపట్టవలసిన చర్యల గురించి ఈ ఓ దిశానిర్దేశం చేశారు.
ఈ ఓ మాట్లాడుతూ శ్రావణ మాసం లో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ పౌర్ణమి, శు. మరియు బహుళ ఏకాదశి రోజులు, శ్రావణ మాసశివరాత్రి, ప్రభుత్వ సెలవు రోజులలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి సందర్శించే అవకాశం ఉందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు ముందస్తుగా ఆయా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం , బిస్కెట్లను అందజేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
భక్తుల రద్దీకనుగుణంగా అన్నదానమందిరంలో అన్న ప్రసాద వితరణను, సాయంకాలం అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్నిఈ ఓ ఆదేశించారు. భక్తులరద్దీ రోజులలో ఉదయం వేళలో వేడిపాలను కూడా అందజేయాలని ఆదేశించారు.భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు లడ్డూ ప్రసాదాలను తయారు చేసి అందుబాటులో ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.భక్తులు లడ్డూ ప్రసాదాల కోసం అధికసమయం వేచివుండకుండా త్వరితంగా లడ్డూ ప్రసాదాలను అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు ఈ ఓ .ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
ఆలయ వేళలు:
ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువజామున గం.3.00లకే ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు జరుగుతాయి. గం.4.30నిలకు ఉభయ దేవాలయాలలో మహామంగళహారతులు ప్రారంభిస్తారు. మహా మంగళ హారతుల ప్రారంభం నుంచే అనగా గం. 4.30లకే భక్తులను దర్శనాలకు అనుమతించడం జరగుతుంది. సాయంత్రం గం. 4.00ల వరకు సర్వదర్శనం కొనసాగిస్తారు. • తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయశుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళవాయిద్యాలు, ప్రదోషకాలపూజలు, సుసాంధ్యం తరువాత గం. 5.30ల నుంచి మహామంగళహారతులు ప్రారంభించబడుతాయి. మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా సాయంకాలం గం. 5.30ల నుంచే రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.
గర్బాలయ అభిషేకాలు : – • శ్రావణమాసంలో రద్దీ కారణంగా శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు,
శ్రావణసోమవారాలు, శ్రావణ పౌర్ణమి, (12.08.2022) రోజులలో గర్బాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయబడుతాయి.ఇతర రోజులలో ఈ గర్భాలయ అభిషేకాలను యథావిధిగా నిర్వహించబడుతాయి.
సామూహిక అభిషేకాలు :
ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే సామూహిక అభిషేకాలు మూడు విడతలుగా జరుగుతాయి.
మొదటి విడత గం.6.30 లకు, రెండవ విడత గం. 11.30గంటలకు, మూడవ విడత తిరిగి సాయంకాలం 6.30 గంటలకు జరుగుతాయి.రద్దీ రోజులలో శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ సోమవారాలు మరియు శ్రావణ పౌర్ణమిరోజులలో సామూహిక అభిషేక సేవాకర్తలకు కూడా గత కార్తిక మాసములో నిర్వహించినట్లుగానే శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
కుంకుమార్చనలు :
శ్రావణమాసాలలో రద్దీరోజులలో శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ సోమవారాలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేస్తారు. • ఈ కుంకుమార్చనలు (రూ. 1000/-లు) అమ్మవారి ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తారు.
అఖండ శివనామ భజనలు :
లోక కల్యాణం కోసం శ్రావణ మాసమంతా శ్రావణ శుద్ధ పాడ్యమి (29.07.2022) నుండి బాధ్రపదశుద్ధ పాడ్యమి (28.08.2022) వరకు అఖండ చతుస్సప్తహా శివ భజనలు జరుగుతాయి. • ఈ అఖండ భజనలలో మొత్తం 7 భజన బృందాలకు అవకాశం కల్పించారు.ఒక్కొక్క భజన బృందంలో 45 మంది పాల్గొనే అవకాశం .
సామూహిక వరలక్ష్మీ వ్రతములు •
శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండు పర్యాయాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతములు జరుగుతాయి.
శ్రావణ రెండవ శుక్రవారం రోజున 05.08.2022న 1,000 మంది ముత్తైదువులకు ఈ వ్రతం అవకాశం. • అదేవిధంగా శ్రావణ నాలుగో శుక్రవారం 19.08.2022న ప్రత్యేకంగా 500 మంది చెంచు ముత్తైదువులకు, 500 మంది ఇతర భక్తులకు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అవకాశం వుంటుంది.
సాధారణ రోజులలో స్పర్శదర్శనం :
ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే శ్రావణమాసంలో కూడా మంగళ, బుధ,గురు, శుక్రవారాలలో (శ్రావణ పౌర్ణమి రోజు మినహా) భక్తులకు మధ్యాహ్నవేళలో శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనం కల్పించబడుతుంది. స్పర్శదర్శనం కోరే భక్తులు మధ్యాహ్నం గం.1.30లలోగా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద రిపోర్టు చేయవలసి వుంటుంది. మధ్యాహ్నం గం. 1.30ల నుంచి మధ్యాహ్నం గం. 2.00ల లోపల క్యూలైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం వుంటుంది.స్పర్శదర్శనానికి కేవలం 1500 మందికి మాత్రమే అవకాశం ఉన్న కారణంగా, భక్తులు మధ్యాహ్నం గం. 1.30ల నుంచి గం. 2.00లలోగా క్యూలైన్ లో ప్రవేశించవలసి వుంటుంది. • ఈ సమయములో క్యూలైన్ లో ప్రవేశించిన భక్తులకు మధ్యాహ్నం గం. 2.00ల నుంచి గం.
4.00ల వరకు స్పర్శదర్శనం కల్పించబడుతుంది.