
శ్రీశైల దేవస్థానం:నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా
ప్రారంభమయ్యాయి.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్తానుసారం
జరిగాయి.
ప్రారంభ పూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు,
కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి,
శ్రీమతి ఎం. విజయలక్ష్మి శ్రీ మతి సూరిశెట్టి మాధవీలత, ప్రత్యేక ఆహ్వానితులు బి. రామమోహన్నాయుడు
తదితరులు పాల్గొన్నారు.
యాగశాల ప్రవేశం :
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి,
స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్దంగా ఆలయప్రాంగణంలోని
స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
వేదస్వస్తి :
ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం :
వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ
సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు
మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు,
వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
పుణ్యాహవచనం :
గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిగింది. వృద్ధి అభ్యుదయాల కోసం
ఈ పుణ్యహవచనం జరిపారు.
చండీశ్వరపూజ :
సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ చేసారు. ఈ బ్రహ్మోత్సవాలు సృష్టికర్త అయిన
బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన
చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహణ వుంటుంది.అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరుని ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు
జరిగాయి. తరువాత కంకణధారణ చేసారు.
బుత్విగ్వరణం :
కంకణ ధారణ తరువాత బుత్విగ్వరణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో ఆయా వైదిక
కార్యక్రమాలు నిర్వహించాలని బుత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్ష వస్త్రాలు సమర్పించే కార్యక్రమమే
బుత్విగ్వరణం
అఖండస్థాపన :
బుత్విగ్వరణం తరువాత అఖండ దీపస్థాపన చేసారు. అనంతరం వాస్తుపూజ జరిగింది.
తరువాత వాస్తు హోమం నిర్వహించారు.
రుద్రకలశస్థాపన :
వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి రుద్ర కలశస్థాపన చేశారు. కలశస్థాపన తరువాత
కలశార్చన ,తరువాత పంచావరణార్చనలు నిర్వహించారు.అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్థానాలు జరిగాయి .
అంకురార్పణ :
బ్రహ్మోత్సవాల మొదటిరోజు సాయంకాలం అంకురార్పణకు ఎంతో విశేషముంది.
ఈ కార్యక్రమం లో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు
తీసుకువచ్చారు. దీనినే “ మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో)
నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభించారు. ఈ అంకురారోపణ
కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి
చెందాలని ప్రార్తించారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ధ్వజారోహణ :
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత వుంది.
ఆలయప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ ఈ ధ్వజారోహణ.
ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుని చిత్రీకరించారు. దీనికే
నంది ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన ప్రత్యేక తాడును ఉపయోగించారు. తరువాత నందిధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వరస్వామి సమక్షములో
పూజాదికాలు జరిపారు. ఈ కార్యక్రమములోనే భేరీపూజ కూడా జరిగింది.
భేరీపూజలో డోలు వాద్యానికి పూజదికాలు జరిగాయి. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల
ఆలాపనతో ఆయాదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై
ఎగురవేసారు.
ధ్వజస్తంభం మీద ఎగిరిన నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం
అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్జీత స్థలాలు కేటాయించి, రోజూ పద్దతి ప్రకారంగా వారికి
నివేదన సమర్పిస్తారు. బ్రహ్మోత్సవ సమయములో దేవతలంతా క్షేత్రంలోనే వుంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని
ఆగమశాస్తాలు చెబుతున్నాయి.