
శ్రీశైలదేవస్థానం:పుష్యశుద్ధ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది.శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు మహా మంగళహారతుల అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, వలయరహదారి మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్ధిరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరి అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు వచ్చింది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది.
శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతా యుగములో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వార క్షేత్రాలగుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.