×

ముఖ్యమంత్రి విజన్ ను ఆదర్శంగా తీసుకోవాలి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ముఖ్యమంత్రి విజన్ ను ఆదర్శంగా తీసుకోవాలి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

Hyderabad,Dec27,2022: తెలంగాణ బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ జపాన్ ప్రభుత్వ పథకం స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్స్ క్రింద జపాన్లో పనిచేసేందుకు అర్హత గల నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం  ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జపాన్లో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మంగళవారం  రాజేంద్ర నగర్ లోని  (టిఎస్ఐఆర్డి) తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఎంపికైన 25 మంది నర్సింగ్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ ను ముందుకు తీసుకు వెళ్లాలనే   ముఖ్యమంత్రి విజన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో నర్సింగ్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని, గౌరవప్రదమైన వేతనంతో పాటుగా మంచి అవకాశాలు ఉన్నందున శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకునే 25 మంది అభ్యర్థులు ఫిబ్రవరి చివరిలోగా ఆఫర్  లెటర్స్ పొందగలరని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జపాన్ భాష నేర్చుకోవాలని పట్టుదల, లక్ష్యము కలిగి ఉండాలని ఆయన కోరారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలకు జపాన్ వెళ్లే అభ్యర్థులకు, వారి కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉంటుందని ఆయన అన్నారు. జపాన్ లో ఉద్యోగాలు పొంది ఇతరులకు మార్గదర్శకులు కావాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలనే  లక్ష్యంతో ఇప్పటికే 17 కళాశాలలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నర్సింగ్, పారామెడికల్ సేవలు నూరు శాతం రావాలనే విజన్ తో ముఖ్యమంత్రి కృతనిచ్చేయంతో ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాబ్ అబ్రాడ్  పేర రెండు నెలల్లోనే కార్యక్రమం  రూపుదాల్చడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు సమిష్టి కృషి చేసిన ఉన్నతాధికారులను అభినందించారు.

 

కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టాoకాం వైస్ చైర్మన్ రాణి కుముదిని మాట్లాడుతూ, ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న పంచాయితీరాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమాలకు టీఎస్ఐఆర్డీని సద్వినియోగపర్చుకోవాలని అభ్యర్థులకు శిక్షణలో భాగంగా జపానీస్ ఫుడ్ ఫెస్టివల్ తో పాటు ఒకరోజు జపనీస్ తో కూడిన   ఆచార వ్యవహారాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ, జపాన్ దేశంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యువతకు అవకాశాలు ఉన్నందున, నర్సింగ్ అభ్యర్థులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు.

వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జపాన్ దేశ నావిష్ సంస్థ సీఈవో టకాకా ఓసి ఋషి మాట్లాడుతూ, కార్యక్రమానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పలుసార్లు సిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కార్యక్రమంలో ఓఎస్డి డాక్టర్ గంగాధర్, టాంకాం సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విద్యుల్లత, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed