
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర ఆజాద్ అన్నారు. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారిగా (చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ) నియమితులైన దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, ఉప కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఆత్మకూరు పోలీస్ డీఎస్పీ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్ రావు, గంగయ్యయాదవ్ కూడా పాల్గొన్నారు.
భక్తులకు దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వైద్యఆరోగ్యసేవలు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లు మొదలైన అంశాల గురించి చర్చించారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు సంబంధించి ఆయా ఏర్పాట్లను వివరించారు.
తరువాత ఉత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ మాట్లాడుతూ భక్తుల రద్దీకి తగినట్లుగా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి కొరత లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు. కాలిబాట మార్గములో మంచినీటిసరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. భక్తుల కాలిబాట మార్గంలోని కైలాసద్వారం, హాటకేశ్వరాలలో భక్తులు స్నానాలాచరించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల ప్రారంభంకంటే ముందస్తుగానే భక్తులు కాలిబాటమార్గంలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుందని చెబుతూ ఉత్సవాల ముందురోజు నుంచే కైలాసద్వారంలో దేవస్థానం నుంచి అన్నప్రసాదవితరణ ఏర్పాటు ఉండాలన్నారు.
పాతాళగంగలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతున్న కారణంగా పుణ్యస్నానాల ఏర్పాటు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. వీలైనంత మేరకు పాతాళగంగలో జల్లు స్నానాలకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.అదేవిధంగా భద్రతాచర్యలలో భాగంగా పాతాళగంగలో ఈత నిపుణులను అధికసంఖ్యలో నియమించాలన్నారు.
ముఖ్యంగా పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అదనపు గదులు ఏర్పాటు ఉండాలన్నారు. పాతాళగంగలో శౌచాలయాల శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా చెత్తచెదారాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా తగు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.దర్శన ఏర్పాట్ల గురించి చర్చిస్తూ భక్తులు క్యూలైన్లలో అధిక సమయం వేచివుండకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు
మంచినీరు,అల్పాహారం క్రమం తప్పకుండా అందిస్తుండాలన్నారు. శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడి సమర్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా ఉండాలన్నారు. ఎప్పటివలనే దీక్షా భక్తుల దర్శనాలకు తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.క్షేత్రపరిధిలో అవసరమైన అన్నిచోట్ల కూడా సమాచారబోర్డులు, సూచికబోర్డులు అధికసంఖ్యలో
ఉండాలన్నారు.ముఖ్యంగా ఆయా కూడళ్ళ నుంచి పార్కింగు ప్రదేశాలకు సూచించే మార్గసూచికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలలో తెలుగురాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక నుంచి కూడా అధికసంఖ్యలో భక్తులు క్షేత్రానికి విచ్చేస్తుంటారని, కాబట్టి తాత్కాలిక సమాచార కేంద్రాలలో సమాచారాన్ని అందించే శివసేవకులను తెలుగు ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన సమాచార కేంద్రాలలో భాషాపరమైన ఇబ్బందులు ఉండవన్నారు.
భక్తులకు వైద్యఆరోగ్యసేవలను అందించడం పట్ల తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దేవస్థానం వైద్యశాలలో తగినన్నీ ఔషధాలను ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.అదేవిధంగా ఉత్సవాలలో ఏర్పాటు చేసే వైద్యశాలల కూడా తగినంత మేరకు ఔషధాలు ఉంచాలన్నారు.
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు మొదలైనవాటిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి కార్యక్రమాల వలన ధర్మప్రచారానికి అవకాశం కలుగుతుందన్నారు.