శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం లోకకల్యాణం కోసం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది.కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు చేసారు.లోకోద్దరణ కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరి తీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో వుంది.శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమా విశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.
శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజి నగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.