
శ్రీశైల దేవస్థానం:సోమవారం అమావాస్యను పురస్కరించుకుని లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను నిర్వహిస్తారు.
అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది.
ఈ రోజు పరోక్షసేవ ద్వారా 25 మంది భక్తులు ఈ విశేష పూజలను జరిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుండి కూడా భక్తులు ఈ రోజు ఈ పూజలను జరిపించుకున్నారు.
కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశం
వుంది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 / లను సంప్రదించవచ్చును