
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (04.10.2021) న నందీశ్వరస్వామివారికి పరోక్షసేవగా విశేషార్చన జరిగింది.
ప్రతి మంగళవారం రోజున, త్రయోదశి రోజులలో దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం చేస్తున్నారు.
అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి , బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను భక్తులు పరోక్ష సేవగా జరిపించుకునే అవకాశం ఉంది.
కాగా ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకంజరిపారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.
పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.
కాగా నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా http: //aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/ 52 /53/54 | 55/56 లను సంప్రదించవచ్చును.