
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం 12 వ తేదీ నుండి శ్రీశైల ద్వారా క్షేత్రాలలో అక్కడి అధి దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నదని దేవస్థానం ఈ ఓ తెలిపారు.
“చతుర్ద్వార అర్చన”గా ఈ కార్యక్రమంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఆయా ద్వారా క్షేత్రాలలో ప్రత్యేక పూజలను జరిపించిన తరువాత చివరి రోజు 16న శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను జరిపించడం ఆనవాయితి. ఈ కార్యక్రమాన్ని గిరిప్రదక్షిణ అనే పేరుతో కూడా పిలుస్తారు.
ఈ అర్చనలలో ప్రతి ఆలయంలోను శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, శ్రీ అమ్మవారికి సహస్రనామార్చన జరుపుతారు.
ఈ విశేష కైంకర్యంలో శ్రీశైల దేవస్థానం తరుపున ప్రతీ ఆలయంలోను అక్కడ అధిదేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. అదే విధంగా ప్రతీ ఆలయంలోను అర్చక సత్కారం చేస్తారు. ఈ సత్కార కార్యక్రమంలో ఆయా ఆలయాలలోని ప్రధాన అర్చకులకు, ఉపప్రధానార్చకులకు దేవస్థానం తరుపున వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, సంభావన అందిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 12న శ్రీశైలక్షేత్ర తూర్పుద్వారమైన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో,13న దక్షిణ ద్వారమైన కడప జిల్లాలోని సిద్ధవటంలో, 14న పశ్చిమద్వారమైన తెలంగాణా రాష్ట్ర జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలోనూ, 15న నాగర్ కర్నూలు జిల్లాలోని ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరంలో పూజలను నిర్వహిస్తారు. 16న ఈ దేవస్థానములో శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా విశేషపూజలు జరుగుతాయి.
శ్రీశైలానికి నేరుగా రోడ్డు మార్గం లేని పూర్వపు రోజులలో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలాన్ని చేరుకోవడంతో ఈ నాలుగు క్షేత్రాలు శ్రీశైల ద్వార క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.