శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం బుధవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించింది.
ఆలయ ప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోర వీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్ష ప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.
కాగా ప్రతి బుధవారం ప్రదోష కాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.
కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజను నిర్వహించారు.
తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించారు.
ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపారు.
