శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు 17న శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
తరువాత శ్రీస్వామివారి యాగశాలలో శ్రీచండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిపించారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం జరిపారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపారు.
అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు . చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు ఎ. శ్రీనివాసులు, ప్రధానార్చకులు స్థానాచార్యులు (అధ్యాపక) వేదపండితులు, అర్చకస్వాములు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సదస్యం నాగవల్లి:
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు సాయంత్రం స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో సదస్యం ,నాగవల్లి కార్యక్రమాలు జరిపించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి, నిర్వహించారు.
ధ్వజావరోహణ:
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం జరిపారు. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటి రోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ ప్రత్యేకం.
ఆదివారం ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
18న సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ , ఆలయ ఉత్సవం వుంటాయి. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం జరుపుతారు.
