
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణార్థం పంచమఠాలలో సోమవారం ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపారు. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపారు.
ఈ రోజు జరిగిన విశేష పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించారు. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్ధంగా అభిషేకాది అర్చనలను నిర్వహించారు.
కాగా శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించిన ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి.
కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి. శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో వాడుకలోవున్నాయి.
కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేశారు. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేశారు.
ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు జరుగుతున్నాయి.