శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, సిబ్బంది అందరు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీనుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడు కూడా పూర్తి సంతృప్తితో తిరిగివెళ్ళే విధంగా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి శ్రీభ్రమరాంబా అతిథిగృహంలో దేవస్థాన యూనిట్ అధికారుల, పర్యవేక్షకులతో కమిషనరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు విభాగాల వారిగా చేపట్టిన ఆయా ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు , జిల్లా యంత్రాంగం వారి సహాయ సహకారాలతో ఆయా ఏర్పాట్లన్నింటిని పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూపొందించుకున్న ప్రణాళికలను అనుసరించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సంవత్సరం భక్తులరద్దీ అధికంగా ఉండేఅవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా క్యూలైన్ల్నీ కూడా దృఢంగా ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలోని అన్నిచోట్ల కూడా అత్యవసర ద్వారాలు ఉండాలన్నారు. అత్యవసర ద్వారాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేకంగా ఎర్రటి రంగును వేయాలన్నారు.
భక్తులు ఇబ్బంది పడకుండా వుండేందుకకు దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వార ఎప్పటికప్పుడు మైకు ద్వారా సమాచారాన్ని తెలియజేస్తుండాలన్నారు. ఈ సమాచారాన్ని తెలుగుతో పాటు కన్నడ, హింది, ఇంగ్లీష్ భాషలలో కూడా ఉండాలన్నారు. భక్తుల సహాయార్థం ఏర్పాటు చేసే సహాయ కేంద్రాలలో ఉన్న స్వచ్ఛంద సేవకులు భక్తులు అడిగే సమాచారాన్ని వివరంగా తెలియజేసే విధంగా సంబంధిత సిబ్బంది పర్యవేక్షిస్తుండాలన్నారు. భక్తులకు సమాచారం తెలిసేవిధంగా అవసరమైన మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు ఉండాలన్నారు. ఈ బోర్డులలో తెలుగుతో పాటు కన్నడ, హింది, ఇంగ్లీష్ భాలలో కూడా ఉండాన్నారు.
బ్రహ్మోత్సవాలలో భక్తులు ఉచితంగా శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శంన టికెట్లు పొందేందుకు వీలుగా వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా లడ్డు ప్రసాదం టికెట్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు
క్యూలైన్ల నిర్వహణ, క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, మంచినీటి అందజేత, అన్నప్రసాద వితరణ మొదలైన విధులకు శివసేవకుల సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు.
క్షేత్రంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. శౌచాలయాల శుభ్రత పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షకస్థాయి అధికారిని ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
