
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కోతులు , వీధికుక్కల సమస్యను పరిష్కరించేందుకు బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటిర్నరీ కౌన్సిల్ ప్రెసిడెంట్ డా. పి.వి. లక్ష్మయ్య, ఆ సంస్థ రిజిష్టార్ డా. ఎ. ఈశ్వరరావు, డా. జె.వి. రమణ, వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర వెటిర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి, యన్. రాంబాబు, నంద్యాల డివిజనల్ పంచాయితీ ఆఫీసర్, సి.హెచ్ పెద్దయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు డా. అశోక్‌కుమార్, వెటిర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఆత్మకూరు , దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారివారి యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రంలో వీధికుక్కల సంఖ్య రోజురోజుకు అధికం కావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ వీధికుక్కల తో పలువురు స్థానికులు అప్పుడప్పుడు కుక్కకాటుకు గురవుతున్నారు. అదేవిధంగా కోతుల బెదడ కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. వీధికుక్కలు , కోతుల వల్ల భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారానికై కనుగొనేందుకు ఆయా విభాగాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ విషయమై అందరి సూచనలు- సలహాలను పొందడం జరుగుతుందన్నారు.
ఈ సమస్య పరిష్కారంలో జంతు సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుందన్నారు. వీధికుక్కలు , కోతుల నియంత్రణ అనేది వాటికి ఎటువంటి హాని తలపెట్టని రీతిలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పద్దతులలో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోబడుతాయన్నారు.
తరువాత సమావేశానికి విచ్చేసిన అధికారులు మాట్లాడుతూ అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. డబ్బాలపై మూతలు తెరచివుంచడం, ఇండ్ల వెలుపలివైపు పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, పండ్లు మొదలైనవాటిని బయటకు కనపడేవిధంగా పెట్టడంలాంటి వలన కోతుల బెడద ఎక్కువగా ఉంటుందన్నారు.
మానవుని జీర్ణ వ్యవస్థకు , జంతువుల జీర్ణ వ్యవస్థకు కొంత వ్యత్యాసం ఉంటుందన్నారు. ఈ కారణంగా కోతులు సహజంగా లభించే కాయలు, పండ్లు సహజమైన ఆహారమన్నారు. అయితే పలురకాలైన ఆహారాలను కోతులకు అలవాటు చేయడం వలన ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అదేవిధంగా ఆయా ప్రదేశాలలో చెత్తాచెదారాలు వేయడం, వ్యర్థాలు వేయడం వలన వీధి కుక్కులు విచ్చలవిడిగా తిరుగుతాయన్నారు. అందుకే బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
కోతుల బెడద లేకుండా ఉండేందుకు మోషన్ – సెన్సార్ డిటరెంట్స్ టెక్నాలజీని కూడా వినియోగించుకోవచ్చునన్నారు. వీటిలో మోషన్ – సెన్సారు లైట్లు, ఆటోమెటిక్‌గా నీటిని స్ప్రే చేసే స్పింకర్లను లేదా శబ్దాలు వచ్చే స్పీకర్లు ఉంటాయన్నారు. ఇవి కోతులను భయపెట్టి దూరంగా ఉంచుతాయన్నారు. వీటివలన కోతులకు ఎలాంటి హాని జరగదన్నారు.
అదేవిధంగా కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ లాంటి వాటివి నియమ నిబంధనలకు లోబడి చేయవలసివుంటుందన్నారు.
ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, జి.స్వాములు, పర్యవేక్షకులు డి. రాధాకృష్ణ, పి. రాజశేఖర్, యం. శ్రీగిరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
