
శ్రీశైల దేవస్థానం:ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.
ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిపారు. అనంతరం స్వర్ణరథోత్సవం జరిపారు.
ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, నామసంకీర్తన (భజన) కూడా ఏర్పాటు చేశారు.
ఈనాటి స్వర్ణరథోత్సవంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.