
శ్రీశైల దేవస్థానం: *కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రత్యేక సమావేశం*
కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక శ్రద్ధ అత్యవసరం అని ఈ ఓ లవన్నఆదేశించారు. శ్రీశైల దేవస్థానం లో కోవిడ్ నివారణ చర్యల అమలుపై చర్చించేందుకు ఈ రోజు (08.01.2022) ప్రత్యేక సమావేశం జరిగింది.పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక తహశీల్దార్ రాజేంద్రసింగ్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి. రమణ, సబ్ ఇన్ స్పెక్టర్ నవీన్ బాబు, మండల ప్రాథమిక ఆసుపత్రి డా. సోమశేఖర్ ఈ సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
కోవిడ్ నివారణకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సిబ్బంది అందరు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. దేవస్థానం , స్థానిక పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య మొదలైన అన్ని శాఖలు సమన్వయం తో కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు ఈ ఓ..చంటిపిల్లల తల్లులు ప్రస్తుతానికి తమ శ్రీశైలయాత్రను వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. శ్రీశైలానికి విచ్చేసే భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు.మాస్కును ధరించిన వారిని మాత్రమే దర్శనాలకు అనుమతించడం జరుగుతుందన్నారు.కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా అవసరమైన మేరకు థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను పరిక్షించే ఏర్పాటు చేయాలని దేవస్థానం వైద్య, ఆలయ విభాగాలను ఆదేశించారు.
అదేవిధంగా క్యూలైన్ ప్రవేశమార్గం, ఆలయ మహాద్వారం, ఆలయం వెలుపలకు వచ్చే మార్గాలలో, డార్మెటరీలు, కల్యాణకట్ట (కేశఖండనశాల) కేంద్ర విచారణ కార్యాలయము మరియు అవసరమైన ఇతర చోట్ల చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా శానిటైజర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. వీలైన చోట్ల లెగ్ ఆపరేటేడ్ శానిటైజేషన్ స్టాండు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.భక్తులు కూడా వారి వ్యక్తిగత శానిటైజర్లను కలిగివుండడం మంచిదన్నారు.ముందుజాగ్రత్త చర్యలలో భాగంగానే ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రపర్చడముతోపాటు సమయాను కూలంగా శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేస్తుండాలని ఆదేశించారు.
కోవిడ్ నిబంధనల చర్యలో భాగంగానే దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని సూచనలు చేస్తుండాలన్నారు. కోవిడ్ నివారణ చర్యల పట్ల ప్రజలలో అవగాహన కలిగే విధంగా అధిక సంఖ్యలో మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శానిటైజేషన్ చేసుకోవడం లాంటి అంశాలపై భక్తులకు మరింత అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.అన్నదాన భవనం లో భక్తులు అన్నప్రసాదాల స్వీకరణ సమయములో భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
సిబ్బంది కూడా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. సిబ్బంది అందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.తరువాత తహశీల్దార్ రాజేంద్రసింగ్ మాట్లాడుతూ క్షేత్రపరిధిలో కోవిడ్ నివారణ చర్యలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయాలపై స్థానిక సచివాలయ సిబ్బంది, వాలింటీర్లను ప్రత్యేకంగా వినియోగించడం జరుగుతుందన్నారు.
సమావేశంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి. రమణ మాట్లాడుతూ క్షేత్రపరిధిలో కోవిడ్ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయం లో స్థానికులందరు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు.