శాస్త్రీయంగా ధ్వజావరోహణ,నాగవల్లి,సదస్యం,వేద శ్రవణం,అవభృథ స్నానం,పూర్ణాహుతి

 శ్రీశైల దేవస్థానం:

– పూర్ణాహుతి:

మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు  సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో గురువారం  శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. శ్రీస్వామివారి యాగశాలలో శ్రీచండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం

జరిగాయి.

పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిగింది.

వసంతోత్సవం తరువాత చండీశ్వరస్వామికి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అవబృథస్నానం నిర్వహించారు.

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు, ప్రధానార్చకులు స్థానాచార్యులు ( అధ్యాపక) వేదపండితులు, అర్చకస్వాములు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సదస్యం నాగవల్లి:

సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగానే  సాయంత్రం స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి జరిపారు.

నాగవల్లి కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినాన కల్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.

ధ్వజావరోహణ:

బ్రహ్మోత్సవాలలో భాగంగా  సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగింది..  ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేశారు.

17 తో  ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు:

17 న  సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ , ఆలయ ఉత్సవం వుంటుంది. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంతసేవ, శయనోత్సవం నిర్వహిస్తారు.

 వేదశ్రవణం:

సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం  వేదశ్రవణం  కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో ఈ వేదశ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దేవస్థానం వేదపండితులతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది వేదపండితులు కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ ఆలయం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు తిరుపతి, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు కూడా ఈ కార్యక్రమములో వేదపారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ చేశారు. 

అనంతరం జరిగిన ఋత్విగ్వరణ కార్యక్రమములో వేదపండితులకు నూతన వస్త్రాలు అందించారు.

ఈ కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణములో వేదపఠన కార్యక్రమం జరిగింది. 

దాదాపు 3 గంటలపాటు నిరంతరాయంగా ఈ వేదపారాయణలు కొనసాగాయి.

కాగా ఈ సాయంకాలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సదస్యం కార్యక్రమంలో కూడా వేదపారాయణలు జరిగాయి.

దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కైంకర్యంగా ఘనస్వస్తి జరిగింది.. సుమారు రెండుగంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.