శ్రీశైల దేవస్థానం:శివనామస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ , కార్తిక మాసాలలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో సోమవారం ప్రారంభమయ్యాయి. భాద్రపద శుక్ల పాడ్యమి ( 04.09.2024)న ముగుస్తాయి. ఈ ప్రారంభ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, అధికారులు పాల్గొన్నారు.
భజనలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత శాస్త్రోక్తంగా చండీశ్వరస్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ పూజల అనంతరం శివ ప్రణవ పంచాక్షరీనామ భజనను ప్రారంభించారు.
కాగా కర్నూలు నగరానికి చెందిన అయిదు భజన బృందాలకు , కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు ఈ శ్రావణ మాస శివభజనలు చేయడానికి అవకాశం కల్పించారు.
శ్రీసుంకులమ్మదేవి భజన మండలి వారు (05.08.2024 నుండి 09.08.2024వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలివారు (09.08.2024 నుండి 13.08.2024 వరకు), శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి వారు (13.08.2024 నుండి 17.08.2024 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి వారు ( 17.08.2024 నుండి 21.08.2024 వరకు ) శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి వారు (21.08.2024 నుండి 25.08.2024వరకు), శ్రీశైలమల్లికార్జున భజనసంఘ్, బళ్ళారి, కర్ణాటక వారు ( 25.08.2024 నుండి 28.08.2024 వరకు ) మల్లికార్జున భజన సంఘం, సుంకేశ్వరాహాల్, రాయచూరు జిల్లా మరియు ప్రభులింగ సేవా సంఘం గోపన దేవర హళ్లి, రాయచూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం వారు (28.08.2024 నుండి 04.09.2024 వరకు ) పాల్గొంటున్నారు.