శ్రీశైల దేవస్థానం: సాధారణ భక్తులకు సౌకర్యాల రూపకల్పన పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అన్నారు. ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం జరిగింది.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మొత్తం 14 అంశాలు చర్చించారు. వీటిలో 11 అంశాలు ఆమోదించగా, 2 అంశాలను వాయిదా వేశారు. . ఒక అంశం తిరస్కరించబడింది.
సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు.
• ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజున శ్రీస్వామివారి స్పర్శదర్శనం ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం గిరిజనులకు దేవస్థానం గుర్తింపు కార్డులను కూడా అందజేస్తుందన్నారు.
• జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీవరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను అత్యంతవైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు వుంటాయి. అన్ని ఏర్పాట్లను కూడా ప్రణాళికబద్దంగా చేబడతామన్నారు. ముఖ్యంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తారు.
• నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండలం శివపురం గ్రామములోని శ్రీ కొలనుభారతి సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయంగా నిర్వహింపజేయాలని దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సదరు దేవాలయానికి సంబంధించి భూములు, బంగారం, వెండి, ఎఫ్.డి.ఆర్లు , నగదును దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారుల బృందం , ధర్మకర్తల మండలి సమక్షములో త్వరలో స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. కొలను భారతీ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ఆలయాన్ని దర్శించే భక్తులకు కనీస సదుపాయాలను కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందన్నారు.
• డిసెంబరు 1వ తేదీ నుంచి శ్రీస్వామివారి స్పర్శ దర్శనం , అతి శీఘ్రదర్శనం భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేయడం జరుగుతుందన్నారు. స్పర్శదర్శనం ( రూ. 500/-లు రుసుము) భక్తులకు 100 గ్రాముల బరువుగల రెండు లడ్డుప్రసాదాలను మరియు అతి శీఘ్రదర్శనం (రూ. 300/-ల రుసుముతో అలంకార దర్శనం) 100 గ్రాముల బరువుగల ఒక లడ్డు ప్రసాదం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రసాదాల అందజేతకుగాను టిక్కెట్టుతో పాటు భక్తులకు ప్రసాదం కూపను కూడా ఇవ్వబడుతుందన్నారు. భక్తులు దర్శనానంతరం ప్రత్యేక కౌంటరు నుండి ఈ లడ్డుప్రసాదాలను పొందవచ్చునన్నారు. ఇందుకు ప్రత్యేకంగా సాఫ్టువేరును కూడా రూపొందింపజేయడం జరుగుతుందన్నారు. సాఫ్టువేరు రూపకల్పన వల్ల పారదర్శకంగా టికెట్టుదారులకు ప్రసాదాలను అందజేసే వీలు కలుగుతుందన్నారు.
• ప్రధానాలయంలోని శ్రీగోకులాన్ని దాతల సహకారంతో సంప్రదాయరీతిలోనూ, కళాత్మకంగా ఆధునీకరింపజేయడం జరుగుతుందన్నారు. ఈ ఆధునీకరణ పనులకు నాగదుర్గాప్రసాద్, సాయిస్కిల్స్ కళామందిరం, హైదరాబాద్ వారు ఆధునీకరించేందుకుముందుకు వచ్చారన్నారు. ఆలయ వైదిక కమిటీ, ఇంజనీరింగ్ , దేవస్థాన సహాయ స్థపతి సూచనలను అనుసరించి శ్రీగోకులాన్ని ఆధునీకరిస్తామన్నారు.
• భక్తులు సూచనలు, సలహాలు పొందేందుకు పలుచోట్ల ఫిర్యాదులు మరియు సలహాల పెట్టెను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా భక్తులు అందించే సూచనలను మరియు సలహాలను కూడా పొందడం జరుగుతుందన్నారు.
• భక్తులు ఆయా సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా పలుచోట్ల మరిన్ని డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
• భక్తుల సౌకర్యార్థమై క్షేత్రపరిధిలో ప్రధానకూడళ్ళ వద్ద యాత్రిక సహాయ కేంద్రాలు ( మే ఐ హెల్ప్ యూ సెంటర్లు) ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సహాయ కేంద్రాలలో శివసేవకుల స్వచ్ఛందసేవలను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.
ఇంకా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులు అధిక సమయం దర్శనానికి వేచివుండకుండా త్వరితగతిన దర్శనాలు చేసుకునే విధంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సాధారణ భక్తుల సౌకర్యాల రూపకల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు.
