శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

 శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (25.08.2021)న  ఉదయం సాక్షిగణపతిస్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.

 ప్రతి బుధవారం, సంకటహరచవితి రోజులు, పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం , పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకంజరిగింది. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి.

వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని నమ్మకం. కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని ప్రతీతి. 

కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.

భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒక చేతిలో కలం, మరో చేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.

print

Post Comment

You May Have Missed