
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 18 నుంచి భక్తుల సౌకర్యార్థం దశలవారిగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించామని దేవస్థానం ఈ ఓ కెఎస్.రామరావు తెలిపారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.వివరాలు ఇవి.
గర్భాలయ అభిషేకాలు:
కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అభిషేకాలు ఉంటాయి.
ఇందులో భాగంగా రోజుకు 7 విడతలలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు.
రోజుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 విడతలలోనూ, సాయంకాలం ఒక విడతగాను ఈ గర్భాలయ అభిషేకాలు నిర్వహిస్తారు.
భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా ఈ అభిషేకసేవా టికెట్లను పొందవచ్చును.
సామూహిక అభిషేకాలు :
ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలను నిర్వహిస్తారు.
ఆన్లైన్ ద్వారా, కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ టికెట్లను పొందే అవకాశం కల్పించారు.
మొదటి విడత గం. 6.30లకు, రెండవ విడత గం. 10.00 గంటలకు, మూడవ విడత 12.30 గంటలకు నాల్గవ విడతలుగా సాయంత్రం 6.30 గంటలకు జరుగుతాయి. సామూహిక అభిషేక సేవాకర్తలకు అభిషేకానంతరం స్వామివారి స్పర్శదర్శనం ఉంటుంది.
కుంకుమార్చన ( అంతరాలయం లో):
గతంలో వలనే అమ్మవారి అంతరాలయములో కూడా ఆర్జిత కుంకుమార్చనలు ఉంటాయి.
కోవిడ్ ముందుజాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని కుంకుమార్చనలను కూడా పరిమిత సంఖ్యలో విడతల వారిగా నిర్వహిస్తారు.
నవావరణార్చన :
భక్తుల సౌకర్యార్థం గతంలో వలనే నవావరణార్చన కూడా ఉంటుంది. ఈ నవావరణ సాయంత్రం 6.30గంటల నిర్వహిస్తారు.
శ్రీ మల్లికార్జునస్వామివార్లకు అభిషేకం: వృద్ధమల్లికార్జునస్వామివారికి ఆర్జిత అభిషేకాలు కూడా విడతల వారిగా పరిమిత సంఖ్యలో ఉంటాయి.18వ తేదీ నుండి నిర్వహిస్తారు.
విరామ దర్శనం :
భక్తుల సౌకర్యార్థం గతంలో వలనే స్వామివార్ల విరామ దర్శనం ( బ్రేక్ దర్శనం) కూడా అవకాశం కల్పించారు. విరామ దర్శనం మూడు విడతలుగా ఉంటుంది. మొదటి విడత విరామ దర్శనం ఉదయం 7.00గంటలకు మధ్యాహ్నం 12.30గంటలకు, రాత్రి 7.30గంటలకు ఉంటాయి.
గతంలో వలనే విరామదర్శనానికి రూ. 500/-లు టికెటు రుసుము చెల్లించవలసి వుంటుంది.
వేదాశీర్వచనం :
గతంలో వలనే భక్తులకు వేదాశీర్వచనం కూడా చేస్తారు. ఈ వేదాశీర్వచనం కూడా రోజుకు నాలుగు విడతలలో ఉంటుంది.
కోవిడ్ నిబంధనలు :
స్వామిఅమ్మవార్ల దర్శనానికి విచ్చేసే భక్తులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వుంటుంది. మాస్కు ధరించి ఉన్న భక్తులను మాత్రమే ఆలయములోనికి అనుమతీస్తారు. ఎవరైనా మాస్కు లేకుండా వచ్చినా ఆలయప్రవేశద్వారం వద్దనే వారిని నిలిపివేసి మాస్కును ధరించి రావలసినదిగా కోరుతారు.
అదేవిధంగా దర్శనానికి విచ్చేసే భక్తులు తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని కూడా తెలిపారు. ఇందుకోసం క్యూలైన్ల ప్రవేశమార్గం, ఆలయమహాద్వారం మొదలైన చోట్ల దేవస్థానం అవసరమైన ఏర్పాట్లను కూడా చేసింది.
భక్తులు తప్పనిసరిగా భౌతికదూరాన్ని కూడా పాటించాల్సి వుంటుంది. కోవిడ్ నిబంధనలను గురించి ఇప్పటికే ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేసారు. ఈ విషయమై మరిన్ని ఫ్లెక్సీ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఆలయప్రసార వ్యవస్థ మైకుద్వారా) ద్వారా కూడా భక్తులకు ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తల గురించి వివరిస్తారు.
సంప్రదాయ వస్త్రధారణ :
స్వామివార్ల స్పర్శదర్శనానికి వచ్చే భక్తులు , ఆర్జితసేవలు జరుపుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణతోనే రావాల్సి వుంటుంది. గతంలో వలనే పురుషులు పంచ, కండువాలను ధరించి రావాల్సి వుంటుంది. మహిళలు కూడా తగిన సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాల్సి వుంటుంది. ఆలయ సంప్రదాయానికి భంగం కలిగించే దుస్తులతో రావడం పూర్తిగా నిషేధించారు. ఆలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ చర్యలకు పూర్తి సహకారాలను అందించవలసినదిగా భక్తులందరినీ కోరుతున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఉచిత ప్రసాద వితరణ :
శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం నిరంతరం ప్రసాద వితరణను నిర్వహిస్తారు.
గతం లో వలనే వేకువజామున దర్శనాలు ప్రారంభమయిన సమయం నుండి రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంతవ ముగిసేంత వరకు కూడా భక్తులకు ఉచిత ప్రసాదం అందిస్తారు.