కర్నూలు, జూలై 30:- కర్నూలు నగర పాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 47వ వార్డ్ మెంబర్ శ్రీమతి నాయకల్లు అరుణ, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించామని ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ డీకే.బాలాజీ , వార్డ్ సభ్యులు పాల్గొన్నారు..
శుక్రవారం కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్ హాలులో నిర్వహించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది.
అనంతరం ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ హోదాలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామున్ , ఎన్నికయిన రెండవ డిప్యూటీ మేయర్ అరుణ తో ప్రమాణస్వీకారం చేయించారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయం పాటిస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.నగర మేయర్ బి వై. రామయ్య, మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ .జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పిస్తూ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలకు డిప్యూటీ మేయర్ పదవులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే
హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ , వీరు రాజకీయాలలో రాణించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, వార్డు మెంబర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.