శ్రీశైల దసరా మహోత్సవాలలో కాత్యాయని అలంకారం, హంసవాహనసేవ , పుష్పపల్లకీ సేవ

 శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజు  మంగళవారం  ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిగాయి.

అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు .  ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపారు.

ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరిగాయి.

కుమారీ పూజ

దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.     

ఈ కుమారిపూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.

కాత్యాయని అలంకారం :

 నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు.

నవదుర్గలలో ఆరవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయ హస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చునని చెప్పబడింది. ఇంకా శ్రీ కృష్ణుని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారినే పూజించారు.

కాత్యాయని ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా హరింపబడుతాయంటారు.

హంసవాహనసేవ:

ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు హంసవాహనసేవ జరిపారు.

ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, హంస వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు

| పుష్పపల్లకీ సేవ:

దసరా మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ జరిపారు.

ఈ సేవలో వివిధపుష్పాలతో అలంకరించబడిన శ్రీ స్వామిఅమ్మవార్లను  మేళతాళాలతో తొడ్కొని వచ్చి పుష్పపల్లకిలో ఊరేగించారు.కాగా ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, అశోక పత్రాల మాల, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.