
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల వైభవంపై లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనను సోమవారం సాయంత్రం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు.
భారతప్రభుత్వంవారి ప్రసాద్ (PRASAD-Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకం కింద ఈ లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేశారు.ఆలయప్రాంగణములో వాయువ్య భాగాన (నాగులకట్ట వెనుక భాగం లో) ఈ లైట్ అండ్ సౌండ్ షో జరిగింది.
సుమారు 40 నిమిషాల నిడివిగల ఈ ప్రదర్శనలో జ్యోతిర్లింగ క్షేత్రాల పరిచయం, అష్టాదశ శక్తిపీఠాల పరిచయం, శ్రీశైలక్షేత్రప్రాశస్త్యం, శిలాద మహర్షి కుమారుడైన పర్వతుడు తపస్సుతో శివుని మెప్పించి పర్వత అకారాన్ని పొంది శ్రీపర్వతంగా మారడం, శ్రీపర్వతంపై పరమేశ్వరుడు శ్రీపర్వతస్వామిగా స్వయంగా కొలువుదీరడం, కాలక్రమములో శ్రీపర్వతం శ్రీశైలంగాను, శ్రీపర్వతస్వామి మల్లికార్జునస్వామిగా పిలువబడటం, ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపాన్ని ధరించి అరుణాసురుడిని సంహరించి శ్రీశైలంలో భ్రమరాంబాదేవిగా అవతరించడం, చంద్రవతికథ, శ్రీశైలములో ఆదిశంకరుల వారు తపస్సు, అక్కమహాదేవి వృత్తాంతం, శ్రీశైలములో అక్కమహాదేవి తపస్సు ఆచరించడం, కదళీవనములో సిద్ధిపొందడం, శ్రీశైల చారిత్రక విశేషాలు మొదలైన అంశాలతో ఈ ప్రదర్శన రూపొందించారు.
ప్రతీరోజు రెండు విడతలుగా , మొదటి ప్రదర్శన రాత్రి గం. 7.00లకు, రెండవ ప్రదర్శన రాత్రి గం. 8.15 ని.లకు ప్రదర్శింపజేస్తారు.
ఈ ప్రదర్శనకు ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము 50/- లుగా నిర్ణయించారు. ప్రతీరోజు సాయంత్రం గం. 5.00ల నుంచి రాత్రి గం.8.00ల వరకు ఈ ప్రవేశ టికెట్లు ఇస్తారు. అమ్మవారి ఆలయం వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరు నుంచి ఈ టికెట్లను పొందవచ్చు.ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.