మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభం

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం బుధవారం  ఉదయం
ప్రారంభమైంది.

భక్తుల సౌకర్యార్థం మార్చి 5 తేదీ వరకు దీక్షా విరమణ కార్యక్రమం ఏర్పాటు వుంది.

జనవరి 19 తేదీన శివమండల దీక్షను, ఫిబ్రవరి 8న అర్ధమండల దీక్షను స్వీకరించిన
భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో జ్యోతిర్ముడిని ( ఇరుముడిని) సమర్పిస్తారు.

ఉదయం మనోహర గుండం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష
పూజాదికాలు జరిపారు.తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో
ఊరేగింపుగా తీసుకొని వెళ్లి శివదీక్షా శిబిరాలలో వేంచేపు చేయించారు.

అనంతరం దీక్షా శిబిరాలలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో
పూజాదికాలు జరిపారు. శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు
కూడా శిబిరాలలోని దేవతామూర్తులకు త్రికాలాలలో శాస్త్రోక్తంగా పూజాదికాలు వుంటాయి.

అనంతరం దీక్షా శిజిరాలలోని హోమగుండానికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలను
జరిపించి హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాధారులు నమశ్శివాయ పంచాక్షరీ
నామస్మరణతో శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో జ్యోతిర్ముడి సమర్పణానంతరం ఆవునెయ్యి, నారికేళం మొదలుగాగల
ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా భక్తులు సమర్పిస్తారు.

కాగా శివదీక్షను స్వీకరించిన భక్తులకు చంద్రవతి కల్యాణ మండపం నుండి ఆలయ తూర్పు
మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనము క్యూలైన్‌ ద్వారా నిర్ణీత వేళలలో స్వామివార్ల దర్శనం
కల్పిస్తారు . అధిక సంఖ్యలో దీక్షా విరమణ చేసే భక్తుల కోసం మూడు వంతులుగా పలువురు
సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు. ఈ సిబ్బంది అంతా శివదీక్షా శిబిరాలలో నిరంతరం
ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.

కాగా మన పురాణాలలోను, వ్యావహారిక గాథల్లోనూ ఈ శివదీక్షా ప్రాశస్త్యం ఎంతగానో
వుంది.చారిత్రకంగా కూడా ఈ శివదీక్షకు ఆధారాలు ఉండటం విశేషం. బాదామి చాళుక్య రాజైన
రెండవ విక్రమాదిత్యుడు ఆంగ్ల శకం 660 సంవత్సరంలో శివమండల దీక్షను స్వీకరించినట్లు గాను
, దీక్షను ఇచ్చిన శివగురువు సుదర్శనాచార్యునికి వంగూరు సీమలోని (నేటి ఉమ్మడి
మహబూబ్‌నగర్‌ జిల్లా) ఇపరుంకల్‌ అనే గ్రామాన్ని  గురుదక్షిణగా ఇచ్చినట్లుగాను, అలంపూరు
మండలంలోని ఆముదాలపాడులో లభించిన విక్రమాదిత్యుని తావ్రుశాసనం చెబుతోంది.

ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, స్వామివార్ల ఆలయ
ప్రధానార్చకులు కె. శివప్రసాద్‌ స్వామి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.