
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం ఆషాఢపౌర్ణమి సందర్భంగా జూలై 24వ తేదీన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహిస్తామని దేవస్థానం ఈ ఓ కే ఎస్. రామరావు తెలిపారు.ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరిస్తారు.
ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీఅమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవి వారికి, సప్తమాతృకలకు, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు, శాకాలంకరణ చేస్తారు.
అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా వివిధ రకాల శాకాలతో అలంకరిస్తారు.
అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారణ , సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు నివారణ అవుతాయని పురాణాలు చెబుతాయి.
పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్జానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది.
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి, క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి.
ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి అర్చించే సంప్రదాయం ఏర్పడింది.