శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఉచితంగా మహామంగళహారతి. వారంలో నాలుగురోజులపాటు భక్తులకు ఉచితంగా శ్రీస్వామివార్ల స్పర్శదర్శనాన్ని కల్పించడం, తెల్లరేషన్కార్డు కలిగిన వారికి నెలలో ఒకరోజున ఉచితంగా నిర్ధిష్టమైన ఆర్జితసేవను జరిపించడం, భక్తులకు ఉచితంగా బ్యాటరీవాహనాలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలను చేపట్టారు.
*మహామంగళహారతి దర్శనానికి సామాన్యలుకు అనుమతి :
ముఖ్యంగా ప్రతీరోజు ఉదయం మహామంగళహారతి ప్రారంభసమయం నుంచే అనగా వేకువ జామున గం. 4.30ల నుంచే సర్వదర్శనం క్యూలైన్ ( ఉచిత క్యూలైన్ దర్శనం) ద్వారా వచ్చే సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు
అదేవిధంగా సాయంకాల వేళలో కూడా మహామంగళహారతి సమయం నుంచే భక్తులను దర్శనానికి అనుమతి.
ప్రస్తుతం రోజుకు ఉదయం , సాయంకాలాలలో సుమారు మూడు వేల మందికి పైగా సామాన్య భక్తులు ఉచితంగా శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతి దర్శనానికి చేసుకోగలుగుతున్నారు.
గతంలో మహామంగళహారతి టికెట్లు సామాన్యభక్తులకు లభించడం కష్టంగా ఉండేది.
సుప్రభాతసేవ, మహామంగళహారతి దర్శనానంతరం అనగా ఉదయం గం. 7.00ల నుంచి మాత్రమే సర్వదర్శనం ప్రారంభించబడుతుండేది. వేకువజాము నుంచి మహామంగళహారతి దర్శనాలు పూర్తయ్యేంతవరకు కూడా సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి వుండాల్సి వచ్చి ఇబ్బందులకు గురయ్యేవారు.
అయితే దర్శనాల విషయములో సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలనే భావనతో సుప్రభాతం మరియు మహామంగళహారతి టికెట్లను నిలుపుదల చేసి మహామంగళహారతికి సామాన్య భక్తులను అనుమతించడం జరుగుతోంది.
కాగా గతంలో కొందరు సుప్రభాతం , మహామంగళహారతి దర్శనం టికెట్లకు మధ్యదళారీలను ఆశ్రయిస్తున్నట్లుగా పలు విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే దేవస్థానం చేపట్టిన ఈ చర్యల వలన ప్రస్తుతం ఎలాంటి సిఫారసులు లేకుండానే సామాన్య భక్తులు ఉచితంగా శ్రీ స్వామివార్ల దర్శనాన్ని చేసుకోగలుగుతున్నారు.
సామాన్య భక్తులకు స్పర్శదర్శనం :
దేవస్థానం ఉచితంగా సామాన్య భక్తులకు శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని కూడా కల్పిస్తోంది.
వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహ్నం గం. 2.00ల నుంచి భక్తులు శ్రీస్వామివారి ఉచితంగా స్పర్శదర్శనం చేసుకోవచ్చు. ఈ రోజులలో సుమారు 2500మందికిపైగా భక్తులు శ్రీస్వామివారి స్పర్శదర్శనం చేసుకొంటున్నారు.
*ఆన్లైన్ ద్వారా ఆర్జితసేవా టికెట్లు పొందే విధానం :
మే మాసం నుంచి అన్ని ఆర్జితసేవాటికెట్లు ,శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నారు. ప్రతి నెలలోని ఆయా ఆర్జితసేవలు, స్పర్శదర్శనం టికెట్లను ఆ ముందు నెల 25వ తేదీన ఆన్లైన్లో ఉంచడం జరుగుతోంది.
టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్ లైన్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చు.
ఈ టికెట్లను మరింత సులభతరంగా పొందేందుకు ఇటీవల దేవస్థానం యాప్ను కూడా
అందుబాటులోకి తీసుకువచ్చారు.
దేవస్థానం చేపట్టిన ఈ చర్యల వలన భక్తులు ఇంటివద్ద నుంచే వసతి సదుపాయాలను, సేవాటికెట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకునే అవకాశం ఏర్పడింది.
*ఉచిత సామూహిక సేవలు :
ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్కార్డు కలిగిన సామాన్య భక్తులు నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలను జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయం కల్పించారు.
ప్రతీనెలలో ఒకరోజున జరిపే నిర్ధిష్ట సేవలో 250 మంది భక్తులు పాల్గొనవచ్చును.
ఈ ఉచిత సామూహిక సేవకు ఆన్లైన్ ద్వారా ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవలసివుంటుంది.
*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయాస్తమానసేవ – ప్రదోషకాలసేవల నిర్వహణ :
తగు రుసుము చెల్లించి ఆయా ఆర్జితసేవలను జరిపించుకునే భక్తుల సౌకర్యార్థం ఉదయాస్తమానసేవ – ప్రదోషకాలసేవలను ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ సేవల నిర్వహణ వలన సామాన్య భక్తులకు దర్శనాలకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. ఈ రెండు ఆర్జితసేవలలో ఒక్కొక్క సేవకు పరిమితంగా కేవలం ఆరు టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది.
ఈ సేవ ప్రారంభించడానికి ముందు పలు దఫాలుగా దేవస్థానం వైదిక కమిటీ మరియు దేవస్థాన వివిధ విభాగాల శాఖాధిపతులు, పర్యవేక్షకుల సమావేశాలలో విస్తృతంగా చర్చించడం
జరిగింది.
ఈ సేవల నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏ ఒక్క భక్తుడు కూడా ఈ సేవల నిర్వహణను వ్యతిరేకించలేదు.
తరువాత ఈ సేవల నిర్వహణకు దేవస్థానం ధర్మకర్తల మండలి వారి ఆమోదమును, అదేవిధంగా కమిషనర్, దేవదాయశాఖ వారి ఆమోదం కూడా పొందారు.
గత సంవత్సరం ఆగస్టు 29వ తేదీ నుంచి ఉదయాస్తమానసేవకు మొత్తం 52 మంది భక్తులు, ప్రదోషకాల సేవకు 328 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందడం జరిగింది. ఈ రెండు సేవల వలన దేవస్థానానికి రూ. 1, 34,96,080 రాబడిగా లభించింది.
ఈ సేవలను జరిపించుకున్న భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ రెండు సేవలపై కొందరు పలు అపోహలకు లోనవుటునట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చినది. కానీ ఈ సేవల వలన సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదని, కేవలం ఆసక్తిగల వారు మాత్రమే ఈ సేవలను జరిపించుకునే అవకాశం ఉన్నదనే విషయాన్ని గ్రహించవలసినదిగా భక్తులను దేవస్థానం కోరింది.
దర్శనాల ఏర్పాట్లు, వసతి కల్పన మొదలైన వాటికి సంబంధించి తీసుకున్న ఆయా విధాననిర్ణయాల వల్ల మరింత పార్శదర్శకంగా, జవాబుదారితనంతో భక్తులకు దేవస్థానం ఆయా సౌకర్యాలను కల్పిస్తున్నది.
అదేవిధంగా భక్తులు మధ్యదళారులను ఆశ్రయించకుండా సౌకర్యవంతమైన విధానములో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు, ఆయా సేవలను జరిపించుకునేందుకు అవకాశం ఏర్పడింది
ఉదయాస్తమానసేవాకర్తలు ఉదయం ఉ గం. 3.00 లు మొదలు నుంచి రాత్రి గం. 11.00ల వరకు వివిధ సేవలలో పాల్గొనవలసివుంటుంది. ఈ విధంగా రోజంతా ఆయా సేవలకు హాజరవ్వడం కొందరికి ఇబ్బందికరంగా ఉంటుందనే భావనతోనూ మరియు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రదోషకాల సేవ తరహాలో ప్రాత కాల సేవను ప్రవేశపెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సేవను ప్రారంభించేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి వారు కూడా ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనను కమి షనరు, దేవదాయశాఖ వారి ఆమోదం పొందిన తరువాత అమలు చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ మరియు దేవస్థానం సామాన్య భక్తుల సౌకర్యాల కల్పన . సులభతర దర్శనాల విషయమై అహర్నిశలు కృషి చేస్తున్నామని దేవస్థానం అధికారికంగా ప్రకటించింది.