
శ్రీశైల దేవస్థానం : శ్రీశైల ఉగాది మహోత్సవాలు రెండోరోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత ఉదయం గం. 8.00 నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు. అమ్మవారికి విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు చేసారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల పూజలు, జపానుష్ఠానములు జరిగాయి.
కైలాస వాహనసేవ:
ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ జరిపారు. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనసేవపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలు జరిపారు. తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. కైలాస వాహనంపై అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, సకలశుభాలు కలుగుతాయని నమ్మకం.
మహాదుర్గ అలంకారం:
ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి మహాదుర్గ అలంకారం గ్రామోత్సవం జరిపారు. అష్టభుజాలు గల ఈ దేవి శంఖం, చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం మొదలైన వాటిని ధరించి దర్శనం ఇచ్చారు.
అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను ఏర్పాటు చేశారు.