శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలలో ఆదివారం ఎనిమిదో రోజు ప్రవచనాలు కొనసాగాయి.
ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన జరిగింది.అనంతరం ప్రవచకులు ముందుగా శ్రీశైలంలోని దివ్యస్థలాల గురించి వివరించారు.మన సంస్కృతిలో వృక్షదేవతలు అనే భావన ఎంతో ప్రసిద్ధమన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్నో దివ్యవృక్షాలు ఉన్నట్లుగా సాహిత్యం చెబుతోందన్నారు. ఇవి కల్పవృక్షాలవంటివి అన్నారు. ఇవి మన కంటికి కనపడవని, కానీ మనం వాటి నీడలోంచి వెళ్ళితే మనకు తెలియకుండా వాటి ప్రభావం పడి మనలో అద్భుతమైన పరిణామం జరిగి అనేక గ్రహబాధలు తొలగిపోతాయన్నారు.
శ్రీశైల క్షేత్రములో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు సాధకునిలోని అంతర్గత శక్తి త్వరితంగా జాగృత మవుతుందని అన్నారు . అందుకే ఎందరెందరో ఆర్షపథగాములకు శ్రీశైలమే స్థావరమైందన్నారు.
శ్రీశైలమహాక్షేత్రం ఎన్నో దివ్యలింగాలకు నిలయమన్నారు. ఎన్నో మహిమాతీర్థాలు క్షేత్రంలో నెలకొని ఉన్నాయన్నారు.
అందుకే శ్రీశైలక్షేత్రమంతా శివస్వరూపంగా దర్శించాలన్నారు. బ్రహ్మదేవుడు కూడా ఒకానొక సందర్భంలో శ్రీశైలంలో తపమాచరించాడని స్కాందపురాణం చెబుతోందన్నారు. శ్రీరామచంద్రుడు తన అవతారకాలంలో శ్రీశైలానికి విచ్చేసి శ్రీగిరిప్రదక్షిణ చేశారన్నారు.పాతాళగంగలో సంకల్పపూర్వకంగా స్నానం చేసినవారు పాపనాశనాన్ని పొందుతారని అన్నారు.మహాభారతములో శేషధర్మములు అనేచోట శ్రీశైలమహిమ అద్భుతంగా వివరించబడిందన్నారు. సర్వసిద్ధులు ప్రసాదిస్తూ సహజమహిమ కలిగిన వాటిని సిద్ధలింగాలుగా చెబుతారన్నారు. అలాంటి సిద్ధలింగాలు శ్రీశైలమహాక్షేత్రంలో అసంఖ్యాకంగా ఉన్నాయన్నారు.