
శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శివనామ మహిమ’ ప్రవచనాలలో శనివారం రెండో నాటి ప్రవచనాలు కొనసాగాయి.ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేసారు. తరువాత సామవేదం తమ ప్రవచాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ శివనామం మహిమాన్వితమైనదని అన్నారు. వేదం రుద్రనామాన్ని ఎంతో విశేషంగా పేర్కొన్నదన్నారు.నామజపం, మంత్రజపాలను, క్షేత్రంలో చేస్తే అధికఫలం లభిస్తుందన్నారు. శ్రీశైలం అత్యంత శక్తి మంతమైన క్షేత్రం కనుక ఇక్కడ జపించే శివనామాలు, శివజపాలు, అత్యధిక ఫలాన్నిస్తాయన్నారు.
రుద్రుడు అంటే దు:ఖాన్ని పొగొట్టేవాడని, రుద్రనామ జపం, చేయడం వల్ల అన్ని గ్రహదోషాలు, తొలగిపోతాయన్నారు సామవేదం . రుద్రాభిషేకం, శివార్చన, రుద్రహోమాలు విశేషఫలదాయకమన్నారు.శ్రీశైలమహాక్షేత్రములో రుద్రాభిషేకం, రుద్రహోమం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణాన్ని భక్తులు జరిపించుకునే అవకాశం ఉందన్నారు. మార్కండేయ మహర్షి కథను కూడా ప్రస్తావించారు.అదేవిధంగా శ్రీశైల సంబంధిత అంశాలలో వసుమతికథను, చంద్రవతికథను ప్రస్తావించారు. క్షేత్రాభివృద్ధికి అధికారులు చూపుతున్న శ్రద్ధ ఎంతగానో ఆహ్వానించదగ్గ విషయమన్నారు.