×

శ్రీశైల మల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా సహస్రఘటాభిషేకం

శ్రీశైల మల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా సహస్రఘటాభిషేకం

 శ్రీశైల దేవస్థానం:సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం  శ్రీమల్లికార్జునస్వామి వారికి శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.

కృష్ణవేణీ నదీజలాలతోనూ ఆలయ ప్రాంగణములోని మల్లికాగుండ జలంతోనూ ఈ అభిషేకం

చేసారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖమంత్రి  కొట్టు సత్యనారాయణ, స్థానిక శాసనసభ్యులు  శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమషనర్  ఎస్. సత్యనారాయణ, ధర్మకర్తలమండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి,  జి. నరసింహారెడ్డి, శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి లక్ష్మీసావిత్రమ్మ,  అలకుంతగిరి మురళి, శ్రీమతి మేరాజోత్ హనుమంత్నాయక్, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత, శ్రీమతి డా. సి. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవదాయశాఖ అర్చక అకాడమీ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల్ ‘చక్రవర్తి పాల్గొన్నారు.

కార్యక్రమం లో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి రుద్రపారాయణ, విరాటపర్వపారాయణ, వారుణానువాక పారాయణ, కాఠక పారాయణలు , పంచాక్షరీ జపం, ఋష్యశృంగ జపం, వరుణ జపాలు చేస్తున్నారు. ఈరోజు  ఉదయం రుద్రహోమం కూడా జరిపించారు.

దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 16మంది ఋత్వికులు కూడా ఈ జపపారాయణలలో పాల్గొన్నారు.

 ఆలయ కైంకర్యంలో భాగంగా  ఉదయం గం. 3.00లకు మంగళవాయిద్యాలు, గం. 3.15లకు సుప్రభాతసేవ జరిగాయి. సుప్రభాతసేవ అనంతరం శ్రీస్వామివారికి ప్రాతఃకాలపూజలను జరిపారు. అనంతరం స్వామివారికి అంతరాలయం నుండే మహా మంగళహారతులు జరిపారు.

అదేవిధంగా అమ్మవారికి ప్రాత:కాలపూజలు, మహామంగళహారతి ఇచ్చారు.

నిత్యపూజాదికాల అనంతరం ఈ ఉదయం ముందుగా అర్చకస్వాములు ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, రాష్ట్రంలో చెరువులు, జలాశయాలలోకి సమృద్ధిగా నీరు చేరాలని జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొన్నారు.

సంకల్పం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.

అనంతరం అర్చకస్వాములు పాతాళగంగ వద్ద కృష్ణవేణీనదీమతల్లికి పూజాదికాలు జరిపి కలశాలలో కృష్ణవేణీ నదీజలాలను తీసుకువచ్చారు.తరువాత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి . దేవదాయశాఖామంత్రి , దేవదాయశాఖ కమిషనర్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు సంప్రదాయాన్ని అనుసరించి కృష్ణవేణీనదీ జలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాది అర్చనలను   నిర్వహించారు.

అనంతరం వీరందరు జలకలశాలను తలపై పెట్టుకుని వేదమంత్రాల నడుమ భజంత్రీలతో నంది ఆలయం వద్దకు చేరుకున్నారు. నందిగుడిలో నందీశ్వరస్వామివారికి, ఆ తరువాత గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి అనంతరం క్షేత్రపాలకుడు వీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలు జరిపించారు.

తరువాత జలకలశాలతోనే ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో  ప్రధాన కలశాలకు, ఇతర కలశాలకు, కృష్ణవేణీనదీజల కలశాలకు పూజాదికాలు చేసారు.

ఈ పూజాదికాల తరువాత మల్లికార్జునస్వామివారికి సహస్రఘటాభిషేకం ప్రారంభించారు. ఈ ఘటాభిషేకం జరుగుతున్నంతసేపు నిరంతరంగా అర్చకస్వాములు రుద్రమంత్రాలను పఠించారు.

ఘటాభిషేకం పూర్తయిన తరువాత మహానివేదన, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు

జరిగాయి.

కాగా ఈ ఘటాభిషేకం సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు అడుగుల మేర తాత్కాలికంగా గోడ కట్టారు .  దాంతో ఈ రోజంతా కూడా స్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు.

రేపు ఉదయం ( 30న ) వేకువజామున మంగళవాయిద్యాలకు ముందుగా గర్భాలయంలోని జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తారు.

*ఆషాఢమాసం సందర్బంగా.. సారెను ( వస్త్రాలను) సమర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

print

Post Comment

You May Have Missed