ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధి ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత పలు ప్రాంతాల పీఠాధిపతులతో సదస్సు జరిగింది. ఆయా పీఠాధిపతులు, వేదపండితులు శాస్ర్తోక్తంగా స్వామి వారికి కైంకర్యాలు జరిపారు. ఈ ఉత్సవాలు చినజీయర్ పర్యవేక్షణలో వచ్చే నెల ఆరువరకు కొనసాగుతాయి. తొలిరోజు ఉదయం అగ్నిమథనంతో వేడుకలు ఆరంభించారు. అనంతరం సహస్రగళార్చన భగవద్రామానుజ కీర్తనలు 1500 మందితో నిర్వహించారు.
ఈ సందర్భంగా చినజీయర్ మాట్లాడుతూ భగవదనుగ్రహంతో ప్రతిఒక్కరూ సమాజశ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. జాతి, కులం, విద్య, సంపదలకు అతీతంగా దైవానుగ్రహం పొందుటకు అందరూ యోగ్యులేనని అన్నారు. ఉదాత్త, ధార్మిక చైతన్య ఉద్యమంలో తమతోపాటు భక్తులు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మహోత్సవాల ప్రాంగణం శ్రీరామనగరం భక్తజన సంద్రంగా మారింది.