సంప్రదాయరీతిలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు- భక్తుల స్పందనపై ఈ ఓ హర్షం
శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారమైన ఈ రోజు • (03.09.2021) న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేసారు.
కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు.
ఈ సామూహిక గిరిజన వరలక్ష్మీ వ్రతాలలో సుమారు 400 మంది కిపైగా చెంచు ముత్తైదువులతో పాటు, 110 మంది దాకా ఇతరులు పాల్గొన్నారు.
పరోక్షసేవ ద్వారా కూడా 51 మంది భక్తులు వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ మన వైదికసంప్రదాయంలో శ్రావణ మాసాన వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ వ్రత ఆచరణను గురించి పరమేశ్వరుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కాందపురాణములో చెప్పబడినట్లుగా పండితులు పేర్కొంటున్నారని వివరించారు. దేవస్థానం ఆహ్వానం మేరకు వివిధ చెంచుగూడెముల నుంచి చెంచు భక్తులు శ్రీశైలానికి విచ్చేసి వ్రతములో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి చెంచుభక్తులలో అవగాహన కలిగించేందుకుగాను స్థానిక గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారులు, సిబ్బంది ఎంతగానో సహకరించారన్నారు. ఈ సందర్భంగా వారికి కార్యనిర్వహణాధికారి ధన్యవాదాలు తెలియజేశారు.
స్థానిక మేకలబండ చెంచుగూడెములతో పాటు సుండిపెంటలోని చెంచుకాలని, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలు గూడెములకు చెందిన చెంచు భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. స్థానికులతో పాటు పలువురు యాత్రికులు కూడా ఈ వ్రతాలను జరిపించుకున్నారు.
ఈ వ్రతాలకు కావాలసిన పూజాద్రవ్యాలనన్నంటినీ దేవస్థానమే సమకూర్చింది. వ్రతకార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ముత్తైదువల కోసం వేరు వేరుగా కలశాలను నెలకొల్పి శాస్ఈత్రోక్తంగా వ్రతం జరిపారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచారపూజలు జరిగాయి.
అనంతరం వరలక్ష్మీ వ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవి వారిని సమంత్రకంగా ఆవహింపచేశారు. తరువాత శ్రీసూక్త విధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవి వారికి షోడశోపచారపూజలు జరిగాయి. అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేసారు.
అదేవిధంగా వ్రతాన్ని చేసిన ముత్తైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలుగా రవికగుడ్డ, పూలు, గాజులు , ప్రసాదం అందించారు.
వ్రతం చేసుకున్న ముత్తైదువులందరికీ వారు ధరించేందుకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కైలాస కంకణాలు కూడా అందించారు.
వ్రతానంతరం ముత్తైదువులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్లదర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో ముత్తైదువులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. లవన్న, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. హరిదాసు, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసులు, ముఖ్యభద్రతా అధికారి నరసింహరెడ్డి, దేవస్థానం తదితర సిబ్బంది పాల్గొన్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలోని పలువురు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
Post Comment