శ్రీశైల దేవస్థానంలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

 శ్రీశైల దేవస్థానం:  శ్రీశైల దేవస్థానంలో  సామూహిక వరలక్ష్మీ వ్రతములు  వైభవంగా జరిగాయి. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో  500 మందికి పైగా భక్తులు  పాల్గొన్నారు. పరోక్షసేవ ద్వారా వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకున్న 435 మంది భక్తులు జరిపించుకున్నారు. ఈ ఓ కే ఎస్.రామరావు దంపతులు పాల్గొన్నారు.

ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ రెండవ శుక్రవారమైన ఈ రోజు (20.08.2021)న  ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.

ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణ మండపంలో ఈ వ్రతాలను ఏర్పాటు చేసారు . కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు.

 ఈ వ్రత కార్యక్రమం లో పరోక్షసేవ ద్వారా 435 మంది జరిపించుకోగా, ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతంలో 500 ముత్తైదువలు ఈ వ్రతాలను జరిపించుకున్నారు.

కాగా ఈ వ్రతాలకు కావాలసిన పూజాద్రవ్యాలనన్నంటినీ దేవస్థానమే సమకూర్చింది. వ్రతకార్యక్రమంలో  ప్రతీ ముత్తైదువల కోసం వేరు వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా  ఈ వ్రతం జరిపారు.

సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ , తరువాత వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు  షోడశోపచారపూజలు చేసారు.

అనంతరం వరలక్ష్మీ వ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్షీదేవివారిని సమంత్రకంగా ఆవహింపచేసారు. తరువాత శ్రీసూక్తవిధానంలో వ్రతకల్పపూర్వకంగా వరలక్ష్మీదేవివారికి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేసారు.

అదేవిధంగా వ్రతాన్ని జరిపించుకొనే ముత్తైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలుగా రవికగుడ్డ, పూలు, గాజులు ప్రసాదం అందించారు.

వ్రతం చేసుకున్న ముత్తైదువులందరికీ వారు ధరించేందుకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కైలాస కంకణాలు కూడా  అందించారు.

వ్రతానంతరం ముత్తైదువులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామి అమ్మవార్లదర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనం లో  ముత్తైదువులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేసారు.

print

Post Comment

You May Have Missed