విఘ్నసంహారకునిగానే కాకుండా సర్వాభీష్టాలను తీర్చే దైవంగా కూడా గణపతి ప్రసిద్ధి

 శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మ ప్రచారం  లో భాగంగా దేవస్థానం నిర్వహించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలు ఆదివారంతో  ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ప్రవచనాలు గత నెల 24వ తేదీన ప్రారంభమయ్యాయి.

 ఈ ప్రవచనాలలో గణపతి నామ విశేషాలు, గణపతి రూప విశేషాలు, వివిధ పురాణాలలోని గణపతి కథలు, గణపతి మహిమలు, గణపతి తత్త్వం, నవరాత్రోత్సవాలలోని అంతరార్థం మొదలైన అంశాలను వివరించారు.ముఖ్యంగా గణపతి తత్త్వాన్ని  వివిధ ఉపాసన పద్దతులుగా, కథలుగా, రూపాలుగా మన పురాణాదిశాస్త్రాలు వివరించాయన్నారు.

ధర్మగతికి, దేవకార్యాలకు ఆటంకాలు ఎదురైనప్పుడు జగత్ స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలు పరిహరించేందుకు  పలు రూపాలతో వినాయకుడు ఆవిర్భవించినట్లుగా పేర్కొన్నారు. అందుకే ఆ స్వామికి ఎన్నో రూపాలు ఉన్నాయని తెలియజెప్పారు.

వర్షం కారణంగా ఈ నాటి ప్రవచనం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణములోని సమావేశ మందిరములో నిర్వహించారు . ఈ ప్రవచానానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.

 శ్రీ సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ యోగ, మంత్ర, వేదశాస్త్రాలలో ఎన్నో తత్త్వాలను గర్భికరించుకుని గణపతి వైభవం విస్తరించిందన్నారు. ముఖ్యంగా విఘ్నసంహారకునిగానే కాకుండా సర్వాభీష్టాలను తీర్చే దైవంగా కూడా గణపతి పేరొందారన్నారు.ప్రతీ ఒక్కరు కూడా గణపతిని భక్తితో ఆరాధించడం వలన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చునన్నారు. గణపతిని పుష్టిపతి అని కూడా పురాణాలు వర్ణించాయన్నారు. ధనపుష్టి, ధ్యానపుష్టి, జ్ఞానపుష్టి, సిద్ధిపుష్టి మొదలైన సంమృద్ధి భావాలను మన శాస్త్రాలు పేర్కొన్నాయన్నారు. ఈ పుష్టులన్నింటికి గణపతే ప్రభువు అని తెలియజెప్పారు.

 ఈ ప్రవచనాలలో సందర్భానుసారంగా శ్రీశైలక్షేత్ర మహిమా విశేషాలు, వేదసంస్కృతి, సనాతన ధర్మం, ఆచారాలు, సంప్రదాయాలు మొదలైనవాటిని గురించి కూడా వివరించారు.ప్రవచనాలు ముగింపు సందర్భంగా శ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారిని దేవస్థానం వేదమంత్రాల నడుమ ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా వారికి స్వామివార్ల ప్రసాదం, శేషవస్త్రాలు, జ్ఞాపిక అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.