శ్రీశైల దేవస్థానం:ప్రధానాలయానికి ఎదురుగా రహదారి పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సంప్రదాయబద్దంగా పూజాదికాలు జరిపి ఈ రహదారి పనులు ప్రారంభించారు.ప్రస్తుతం గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు తారురోడ్డు పనులను చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల రహదారిని రెండు వైపుల అనగా కుడి, ఎడమ వైపులలో 15 అడుగుల మేర విస్తరింపజేసి మొత్తం 60 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది.
ఈ 60 అడుగుల రహదారి పనులు పూర్తయిన పిదప రెండు వైపులా కూడా నడకదారులు (ఫుట్పాత్లు ) నిర్మిస్తారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలలో జరిగే రథోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా 60 అడుగుల విస్తీర్ణంతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
అదే విధంగా నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులు కూడా చేపడుతారు.
కాగా ఈ రోజు జరిగిన నిర్మాణ పనులు ప్రారంభ కార్యక్రమంలో శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీరు సీతారమేష్ తదితరులు పాల్గొన్నారు.