శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనుల్లో వేగం, పూర్తి నాణ్యత ఉండాలని ఈ ఓ అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 08వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15తేదీన రానున్నది.
11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి , జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో, ధర్మకర్తల మండలి సహకారంతో మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయాలన్నారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల వారీగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను కూలంకుషంగా చర్చించారు. ఆయా విభాగాధిపతులకు, పర్యవేక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాలు కూడా ఇప్పటికే రూపొందింపజేసుకున్న ప్రణాళికను అనుసరించి ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8న ప్రారంభమవుతున్నప్పటికీ భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అందుకే శివరాత్రి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.
గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులరద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే అన్నీ ఏర్పాట్లు కూడా గత సంవత్సరం కంటే కూడా అధికస్థాయిలో చేయాలన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం కంటే కూడా ప్రతీచోట కూడా అవకాశం మేరకు 20 నుండి30 శాతం దాకా అదనపు ఏర్పాట్లు ఉండాలన్నారు.
పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైనచోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అటవీశాఖ వారి సహకారంతో నడకదారిలో వచ్చే భక్తులకు ఆయా ఏర్పాట్లను కల్పించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులు సేద తీరేందుకు ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన ప్రాంగణం ఉండేటట్లుగా పైప్పెండాల్స్, షామియానాలు మొదలైనవాటిని వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. వీటివద్ద తగినంత విద్యుద్దీపాల ఏర్పాట్లు ఉండాలన్నారు.
ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. క్యూలైన్లన్నీ దృఢంగా ఉండేవిధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు ( మూత్రశాలలు , మరుగుదొడ్లు) అవసరమైన అన్ని మరమ్మతులు చేయించి వినియోగంలోకి వచ్చేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. రోజువారి నీటిసరఫరా సామర్థ్యాన్ని, బ్రహ్మోత్సవాలలో క్షేత్రానికి వచ్చే భక్తులరద్దీని బేరీజు వేసుకుంటూ తగు ముందస్తు జాగ్రత్తలో నీటిసరఫరా ఏర్పాట్లు ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అవసరమైనచోట్ల అదనపు కుళాయిలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ పట్ల తగు ముందస్తు ఏర్పాట్లు ఉండాలన్నారు. గతంలో వలనే క్షేత్రపరిధిని జోన్లుగా, సెక్టార్లుగా విభజించి, ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించే విధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు.
పార్కింగు ఏర్పాట్లు, సామాన్లు భద్రపరుచుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, భద్రతా విభాగం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈసారి అదనపు ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచికబోర్డులు అధికసంఖ్యలో ఉండాలన్నారు.
అదేవిధంగా పాతాళగంగలో కూడా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. ముఖ్యంగా పాతాళగంగలో సేఫ్టీమెష్ (రక్షణ కంచె), పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాట్లు, పాతాళగంగమెట్లమార్గంలో అవసరమైన మరమ్మతులు మొదలైనవాటిపట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు.
భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదవితరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛందసేవాసంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
గత సంవత్సరం లడ్డు ప్రసాదాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి తగినన్నీ లడ్డు ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వున్న కౌంటర్లకు అదనంగా మరో 20 లడ్డుకౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 30 లడ్డు ప్రసాదాలకౌంటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
