
శ్రీశైల దేవస్థానం: మహాకుంభాభిషేకం, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా వుండాలని దేవదాయశాఖ కమిషనర్ ఆదేశించారు. మహాకుంభాభిషేకం, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ ఆదివారం సమీక్షించారు.ఈ సమీక్షలో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ సి. గుర్రప్ప, డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ కుమార్, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరుగనున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీంటిని పరిపూర్ణంగా జరిపించాలన్నారు. సమయపాలనతో ఆయా వైదిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలతో పకడ్బందీగా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ముఖ్యంగా ఆలయంలోని గర్భాలయాల విమానాలకు, ఆలయ గోపురాలకు, ఉపాలయాల గోపురాలకు, పంచమఠాలకు ఏర్పాటు చేసిన పరంజాలు సరిచూసుకోవాలన్నారు.
అన్ని విభాగాల అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆయా ఏర్పాట్లను సరిచూసుకుంటూ ఎటువంటి లోపాలు లేకుండా కుంభాభిషేకమహోత్సవాన్ని జరిపించాలన్నారు.
కుంభాభిషేక సమయములో ఆలయ వేళలు మొదలైనవాటిని ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలన్నారు.
మహాకుంభాభిషేకం సందర్భంగా సంప్రదాయరీతిలో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలన్నారు. ముఖ్యంగా మామిడితోరణాలు, అరటి బోదెలతో, పుష్పాలతో ఆయా అలంకరణలు ఉండాలన్నారు.
మహాకుంభాభిషేకాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా క్షేత్రపరిధిలో ప్రధాన కూడళ్ళలో ఎల్.ఈ.డి. స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీశైలటీవి ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయాలన్నారు. అదేవిధంగా ఇతర చానల్స్ కూడా మహాకుంభాభిషేకాన్ని ప్రసారం చేసేవిధంగా శ్రీశైల టీవి ద్వారా క్లీన్ ఫీడును అందజేయాలన్నారు.
మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లను కమిషనర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రతీ భక్తుడు కూడా సౌకర్యవంతంగా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా తిరిగివెళ్ళే విధంగా అధికారులందరు కూడా సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అదేవిధంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వాహనాల పార్కింగు, మంచినీటి సరఫరా, క్యూలైన్ల నిర్వహణ, శివదీక్షా భక్తులకు జ్యోతిర్ముడి సమర్పణ ఏర్పాట్లు, ఆరుబయలు ప్రదేశాలలో విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాలు, పాతాళగంగలో పుణ్యస్నానాలు ఏర్పాటు, కేశఖండన సమర్పణ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు మొదలైనవాటిని అందిస్తుండాలన్నారు.
ఏడాది ఏడాదికి క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతున్నదని, ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే కూడా అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే గత సంవత్సరం కంటే కూడా ప్రతీ విభాగంలో కూడా అదనపు ఏర్పాట్లు తప్పనిఉండాలన్నారు.
ఉత్సవాలలో మార్గసూచికలను, సమాచార బోర్డులను అన్నిచోట్ల కూడా అవసరం మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు.
పాతాళగంగలో నీటిమట్టం తగ్గుతున్న కారణంగా ఎప్పటికప్పుడు పుణ్యస్నానాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రధానంగా స్నానఘట్టాల ఎగువ భాగంలో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలన్నారు. ముఖ్యంగా క్షేత్ర పరిధిలోని శౌచాలయాలు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు. శౌచాలయాలకు నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు.
దర్శనం క్యూలైన్లు, లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాల క్యూలైన్లు మొదలైనవి దృఢంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. క్యూలైన్ల నిడివిని గత సంవత్సరం కంటే కూడా వీలైనంత మేరకు పెంచాలన్నారు.
ఈ సమావేశంలో శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు శివప్రసాద్, అమ్మవారి ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ, అధ్యాపక పూర్ణానందరం, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు ఐ.ఎన్.వి. మోహన్, ఎం. హరిదాసు, శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్ , ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, భద్రతా విభాగం పర్యవేక్షకులు కె. అయ్యన్న తదితర సిబ్బంది పాల్గొన్నారు.