×

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి భక్తుడిని సంత్రుప్తిపరచాలి-జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి భక్తుడిని సంత్రుప్తిపరచాలి-జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 29:-మార్చి 1వ తేదీ నుంచి11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతి భక్తుడు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వెళ్ళే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్‌కుమార్ రెడ్డి సూచించారు. గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూములో శివరాత్రి ఉత్సవాలపై భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై  చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర అజాద్, శ్రీశైల దర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రానికి దాదాపు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా స్వామిఅమ్మవార్ల దర్శనాలు చేసుకుని వెళ్లే రీతిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని మొదటి కో ఆర్డినేషన్ సమావేశంలో అధికారులకు నిర్ధేశించామని, ఈ మేరకు ఆయా ఏర్పాట్లపై సమీక్షించి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలన్నారు. ప్రధానంగా వెంకటాపురం నుంచి శ్రీశైలమునకు దాదాపు 2 లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే అవకాశం వున్నందున మార్గమద్యములో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. అలాగే వృద్ధులు, పిల్లలు, పాదయాత్రలో ఇబ్బందులు పడకుండా సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. భీముని కొలను నుంచి కైలాసద్వారం వరకు మరింత జాగ్రత్తగా ఉండి, వైద్యసేవలను అందించాలన్నారు. క్షేత్రపరిధిలో భక్తులు అత్యవసరం వైద్యానికి గురైనప్పుడు 108 అంబులెన్సులతో పాటు బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని డిఎం. అండ్ హెచ్‌ఓను ఆదేశించారు.

క్యూలైన్లలో స్వామిఅమ్మవార్ల దర్శనార్థమై వేచివుండే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహరం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సూచించారు. తెలంగాణా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పతిష్థ ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్ళేందుకు సూచిక బోర్డులతో పాటు తగు సూచనలను జారీ చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు. శ్రీశైల క్షేత్రపరిధిలో 13 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని, ఇందుకు సంబంధించి ప్రతీరోజు 400 మంది పారిశుద్ధ్య సిబ్బందితో, 8వ తేది నుంచి 11వ తేదీ వరకు 1000 మంది శానిటేషన్ సిబ్బందితో ఎక్కడ చెత్తా చెదారం వుండకుండా పారిశుద్ధ్య పనులను 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని డీపిఓ, డిప్యూటీ సీఈఓను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న చెక్‌పోస్టులను మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలాంటి రుసుము తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. హాటకేశ్వరం సమీపంలో ఉన్న దుకాణాలను మార్పు చేయాలని ఆదేశించారు. అన్నీ ప్రాంతాలలో దోమల నియంత్రణకు ఫాగింగ్ మిషన్లు వినియోగించాలని మలేరియా అధికారులను సూచించారు. దేవస్థానం నుంచి అనుమతి పొందిన చిరువ్యాపారులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రభోత్సవం మరియు రథానికి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్స్‌ కు ధృవీకరణ పత్రాలను ఆర్‌అండ్ బి అధికారులను ఆదేశించారు. హోటళ్ళలో విక్రయించే తినుబండరాలను శ్యాంపిల్స్ ను సేకరించి తనిఖీ చేయడంతో పాటు అన్ని సత్రాలు, హోటళ్ళను తనిఖీ చేయాలని ఫుడ్ స్టేఫీ అధికారులను ఆదేశించారు. 6వతేదీ నుంచి 10వ తేదీవరకు డ్రై డే పాటించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు అమలు చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సమకూర్చాలని ఎపీఎస్‌పి డీసీఎల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రద్దీకనుగుణంగా ఎటువంటి లోట్లుపాట్లు లేకుండా నిరంతరం మంచినీటి సరఫరా చేస్తుండాలన్నారు. ముఖ్యంగా శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం  సంబంధిత అధికారులతో కలిసి భక్తుల క్యూ లైన్ లు, టోల్‌గేట్, వలయ రహదారి ( రింగురోడ్డు) యజ్ఞవాటిక, పార్కింగు ప్రదేశాలు, మల్లమ్మ కన్నీరు ప్రాంతం. పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్ రాహుల్ మీనా, ఆత్మకూరు ఆర్‌డిఓ మిరియాల దాసు, అన్నిశాఖల జిల్లా అధికారులు, మార్కాపురం, దోర్నాల, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

*శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి,అడిషనల్ ఎస్పీ కె.ప్రవీణ్ కుమార్,మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, స్పెషల్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్,దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి. హాజరైన జిల్లా అధికారులు

print

Post Comment

You May Have Missed