ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని విభాగాలు కూడా తగు ముందస్తు ప్రణాళికలతో నిమగ్నం కావాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని , అన్ని విభాగాలు కూడా తగు ముందస్తు ప్రణాళికలతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఈ ఓ శ్రీనివాస రావు  ఆదేశించారు. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా శనివారం  కార్యనిర్వహణాధికారి  దేవస్థాన పరిపాలనా సంబంధి అంశాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించారు.ముందుగా ఉదయం ఇంజనీరింగ్ విభాగాధిపతులతో సమావేశమై ఆయా నిర్మాణ పనులకు సంబంధించిన పనులను సమీక్షించారు.కాగా సాయంకాలం వైదిక కమిటీ సభ్యులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో సమావేశమయ్యారు.

ఇంజనీరింగ్ విభాగ సమీక్షలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకనుగుణంగా ఆయా మౌలికసదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ విభాగం వారు శాస్త్రీయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అదేవిధంగా రాబోవు అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రాభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

అనంతరం ఇటీవల పూర్తి చేసిన ఇంజనీరింగ్ పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, సమీపభవిష్యత్తులో చేపట్టవలసిన పనుల గురించి ఈ ఓ  చర్చించారు.అన్ని నిర్మాణ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు నాణ్యమైన మెటీరియలును వాడాలన్నారు. అదేవిధంగా పనులలో తప్పనిసరిగా పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.ముఖ్యంగా ఆయా పనులలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాలన్నారు.

 సాయంకాలం జరిగిన పరిపాలనకు సంబంధి సమీక్షలో  ఈ ఓ  మాట్లాడుతూ విభాగాధికారులందరు కూడా ఎప్పటికప్పుడు వారివారి విభాగాల సిబ్బందికి తగు దిశానిర్దేశం చేస్తూ సమన్వయంతో విధులను నిర్వర్తింపజేయాలన్నారు. ఏ ఉద్యోగి కూడా తన విధినిర్వహణలో అలసత్వంతో ఉండకూడదన్నారు.ఉద్యోగులందరు కూడా జవాబుదారితనంతో విధులు నిర్వర్తించాలన్నారు. అదేవిధంగా విధినిర్వహణలో పారదర్శకత ఎంతో ముఖ్యమన్నారు. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని శాస్త్రోక్తంగా పరిపూర్ణంగా జరగాలన్నారు.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు ఈ ఓ . క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తనయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలన్నారు. ఆ విధంగా సిబ్బంది అందరు కూడా కృషి చేయాలన్నారు.

*క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలన్నారు  ఈ ఓ . ప్రతి ఉద్యోగి కూడా ఈ భావనను అలవరచుకోవాలన్నారు.ముఖ్యంగా భక్తులు ఎక్కవ సమయం క్యూకాంప్లెక్సులోనూ, క్యూలైన్లలోనూ వేచివుండకుండా టైమ్ స్లాట్ విధానంలో దర్శనం చేసుకునేవిధంగా తగు ప్రణాళిక రూపొందించాలని క్యూకాంప్లెక్సు , ఆలయవిభాగాన్ని ఆదేశించారు.

దర్శనానంతరం భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ ఓ  చెబుతూ ప్రసాదాల విక్రయకేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విక్రయకేంద్ర అధికారులు  సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులరద్దీకనుగుణంగా విక్రయకేంద్రాల వద్ద ప్రసాదాల స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.రాబోవు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని చెబుతూ అన్ని విభాగాలు కూడా తగు ముందస్తు ప్రణాళికలతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు.అన్ని విభాగాల వారు కూడా ఫిబ్రవరి మొదటివారంలోగా ఆయా ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.

క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు ఈ ఓ. అదేవిధంగా దేవస్థానం గదులు, కాటేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవిధంగా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.

ఈ సమవేశంలో వైదిక కమిటీ సభ్యులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, అసిస్టెంట్ కమిషనర్ ఈ. చంద్రశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, అన్నివిభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.