శ్రీశైల దేవస్థానం:
*శ్రావణ మాసోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు
* భక్తులకు వసతి, దర్శనం ఏర్పాట్లు, అన్న ప్రసాద వితరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
* శ్రావణ మాసంలో రెండవ , నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
* లోకకల్యాణం కోసం శ్రావణ మాసమంతా అఖండ శివనామ భజనలు
– కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు పర్యవేక్షణ
ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ ఉదయం వరకు నిర్వహించే
శ్రావణ మాసోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని దర్శిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి
డి.పెద్దిరాజు పేర్కొన్నారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్టాటక, మహారాష్ట్ర , పలు ఉత్తరాది
ల నుంచి కూడా భక్తులు ఈ మాసంలో క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉందన్నారు.
శ్రావణమాసోత్సవాలలో భక్తులకు కల్పించనున్న సౌకర్యాలను ఆదివారం
కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.ఈ సమీక్షలో ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్
అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.ఇప్పటికే ఈ మాసోత్సవాలకు సంబంధించి ఈ నెల 8వ తేదీన ప్రాథమిక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు
తీసుకున్నారు.
కాగా ఈ రోజు జరిగిన సమీక్షలో మాసోత్సవాల నిర్వహణకు చేపట్టిన చర్యలను
ఆయా విభాగాల వారీగా కార్యనిర్వహణాధికారి సమీక్షించారు. ఇంకనూ చేపట్టవలసిన చర్యల
గురించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.ముఖ్యంగా అధికారులందరు కూడా భక్తులకు వసతి, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.అధికారులు, సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. క్షేత్రానికి విచ్చేసే
ప్రతీ భక్తుడిని కూడా అతిథిగా భావించాలన్నారు. ఈ విషయమై స్వచ్చంద సేవలు నిర్వహిస్తున్న
శివసేవకులలో కూడా తగిన అవగాహన కల్పించాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.
అన్ని విభాగాల అధికారులు కూడా మాసోత్సవాల ప్రారంభంలోగానే ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి
చేసుకోవాలన్నారు ఈ ఓ.క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు వసతి కల్పన పట్ల ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని చర్యలు
తీసుకోవాలని వసతి విభాగాన్ని ఆదేశించారు. శ్రావణమాసంలో భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని
సందర్శిస్తున్న కారణంగా అందుబాటులో ఉండే డార్మిటరీ వసతిపట్ల భక్తులకు అవగాహన
కల్పించాలన్నారు. డార్మిటరీ వసతికి సంబంధించి మరిన్ని సూచిక బోర్జులను ఏర్పాటు చేయాలన్నారు.
శ్రావణమాసంలో అధికసంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని
చెబుతూ పాతాళగంగలో తగు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఓ. నిర్దేశించిన స్నానఘట్టాలలో మాత్రమే
భక్తులు నదీస్నానాలు ఆచరించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.ప్రస్తుతం వరదనీటి ప్రవాహం వలన నదీలోతు పెరుగుతోందని చెబుతూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా భక్తులలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయమై పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన కంచెను దాటి
వెళ్ళకుండా కంచెకు ఇటువైపునే భక్తులు స్నానాలాచరించే విధంగా చర్యలు చేపట్టాలని భద్రతా
విభాగాన్ని , నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఈ విషయమై పాతాళగంగలో
సూచిక బోర్జులను ఏర్పాటు వుందని పేర్కొన్నారు.
పాతాళగంగలో పారిశుద్ధ్యనిర్వహణ పట్ల , శౌచాలయాల నిర్వహణ పట్ల ప్రత్యేక
చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ.తరువాత దర్శనం ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్నవిధంగానే
ప్రతీరోజు కూడా వేకువజామున గం. 3.00లకే ఆలయ ద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు,
సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలను జరిపించాలని ప్రధానార్చకులకు , ఆలయ సహాయ
కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు. ఉభయ దేవాలయాలలో మంగళహారతుల ప్రారంభం నుంచే
అనగా వేకువజామున గం. 4.30ల నుంచే భక్తులకు దర్శనాలు అనుమతించాలన్నారు. సాయంత్రం
గం. 4.00లకు వరకు కూడా దర్శనాలు కొనసాగించాలన్నారు. తిరిగి సాయంకాలం ఆలయశుద్ధి
తదితర కార్యక్రమాల అనంతరం గం. 5.30ల నుంచి రాత్రి గం.11.00ల వరకు కూడా దర్శనాలను
కొనసాగిస్తుండాలన్నారు.
శ్రావణ మాసోత్సవాలలో భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాద వితరణ ఉండాలని అన్నప్రసాద
వితరణ విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. ఉదయం గం. 1100ల నుంచే అన్నప్రసాదవితరణను
ప్రారంభించాలన్నారు. అదేవిధంగా సాయంత్రం అల్పాహారాన్ని అందజేయాలన్నారు.క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యం నిర్వహణపట్ల తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రపరిధిలో
అన్నిచోట్ల ముఖ్యంగా ప్రధానరహదారులు, పార్కింగు ప్రదేశాలు మొదలైనచోట్ల చెత్తా చెదారాలను
ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం మంచినీరు, అల్పాహారం నిరంతరం
అందజేస్తుండాలన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకు క్యూకాంప్లెక్సు, క్యూలైన్లు ఆలయ
ప్రాంగణం, దేవస్థానం వసతి భవనాలు మొదలైన అన్నిచోట్ల కూడా ఎలక్ట్రికల్ వైరింగు సరిగ్గా
ఉండేవిధంగా తగు పర్యవేక్షణ చేస్తుండాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు. అవసరమైనచోట్ల
ఎలక్ట్రికల్ వైరింగునకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
ఎప్పటిలాగానే శ్రావణ మాసమంతా కూడా అఖండ శివనామభజనలు ఆనవాయితీ
అనుసరించి నిర్వహించాలని ఆలయవిభాగాన్ని ఆదేశించారు. ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలోని రెండవ నాలుగో శుక్రవారాలలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను జరిపించాలన్నారు. ఈ వరలక్ష్మీ వ్రతాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనేలా తగు ప్రచారాన్ని కల్పించాలని శ్రీశైల ప్రభ విభాగాన్ని ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని
భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీసుశాఖ సహకారాన్ని పొందాలని
సూచించారు.నిత్యకళారాధనలో భాగంగా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను
నిర్వహించాలన్నారు. భక్తి సాహిత్య కార్యక్రమములో భాగంగా ప్రముఖ కవి పండితులచేత అవధాన
కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రఖ్యాత ప్రవచకులచేత ఆధ్యాత్మిక
ప్రవచనాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.