×

సమన్వయంతో స్వచ్ఛంద సేవకుల సేవలు – ఈ ఓ

సమన్వయంతో స్వచ్ఛంద సేవకుల సేవలు – ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:  కర్ణాటక – మహారాష్ట్ర పాదయాత్ర భక్త బృందాలతో రెండో  విడత సమన్వయ సమావేశం జరిగింది.శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 06.04.2024 నుండి 10.04.2024 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 09.04.2024 న  రానున్నది.ఈ ఉత్సవాల సందర్భంగా  అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా సౌకర్యాలు కల్పించే విషయంలో  చర్చించేందుకు మంగళవారం  సాయంత్రం పరిపాలనా భవనం లో సమావేశం నిర్వహించారు. కర్ణాటక , మహారాష్ట్రలకు చెందిన పలు పాదయాత్ర భక్తబృందాలు , స్వచ్చంద సేవాసంస్థల భక్తబృందాలతో రెండో  విడత సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే  కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు,పాదయాత్ర బృందాలు , స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఈ నెల 21వ తేదీన బాగల్ కోట్ జిల్లా రబ్కవిలో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నాటి సమావేశంలో కర్ణాటకలోని బాగల్ కోట్, బెళగావి, బీజాపూర్ (విజయపుర) మొదలైన జిల్లాల నుంచి, మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా ,షోలాపూర్, అక్కల్కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 34 భక్త బృందాలు, పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.సుదీర్ఘముగా జరిగిన ఈ సమావేశములో ఉత్సవ సంబంధి పలు అంశాలు కూలంకుషంగా చర్చించారు.

 సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి  పెద్దిరాజు  మాట్లాడుతూ బాగల్ కోట్ జిల్లా రబ్కావిలో జరిగిన మొదటి సమన్వయ సమావేశానికి , ధర్మప్రచారంలో భాగంగా అక్కడ జరిపిన ధర్మరథయాత్ర , కల్యాణోత్సవానికి కర్ణాటక , మహారాష్ట్ర భక్త బృందాలు ఎంతగానో సహకరించాయని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఉగాది ఉత్సవాలలో  06.04.2024 నుండి 10.04.2024 వరకు అయిదు రోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారని , ఉత్సవాల రోజులలో శ్రీ స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదని  పేర్కొంటూ, ఈ విషయములో భక్త బృందాల ప్రతినిధులు భక్తులలో అవగాహన కల్పించాలన్నారు.

అయితే భక్తుల సౌకర్యార్థం 27.03.2024 నుండి 05.04.2024 వరకు రోజు 4 విడతలుగా స్పర్శదర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. ఒక్కొక్క విడతలో 1500 టికెట్లు ఇస్తారని, గతంలో వలె  ఈ స్పర్శదర్శనానికి రూ.500/-లు రుసుముగా నిర్ణయించామన్నారు.అదేవిధంగా భక్తులు సేద తీరేందుకు ఆరు బయలు ప్రదేశాలలో చలువ పందిర్లు వేయడం జరుగుతుందన్నారు. అన్ని చలువ పందిర్ల వద్ద మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నారు.

క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందిస్తామన్నారు  ఈ వితరణకుగాను స్వచ్ఛంద సేవకులు సేవలను అందించాలన్నారు.ఉత్సవాల సందర్భంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయబడుతాయన్నారు. అదేవిధంగా దేవస్థానం వైద్యశాల నిరంతరం వైద్యసేవలను అందిస్తుందన్నారు.

శ్రీశైలక్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రం కూడా నిరంతరం వైద్యసేవలు అందిస్తుందని

పేర్కొన్నారు.

స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జనలను క్షేత్రపరిధిలో నిషేధించడం జరిగిందని,  భక్తాదులందరు దేవస్థానం పలుచోట్ల ఏర్పాటు చేసిన శౌచాలయాలలోనే తమ కాలకృత్యాలను తీర్చుకోవాలన్నారు. ఈ విషయమై స్వచ్ఛంద సేవా సంస్థల వారు భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు.

స్వచ్చంద సేవకుల సేవలు:

ఉగాది మహోత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ స్వచ్చంద సేవకులు స్వామివారి ఆలయం, ముఖమండపం, నందిమండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శనం ఉచిత క్యూలైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగాభవాని స్నానఘట్టాలు, పాతాళగంగ హఠకేశ్వరం, సాక్షిగణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, తాత్కాలిక సమాచార కేంద్రాలు తదితర చోట్ల ఆయా సేవలను అందించవలసి ఉంటుందన్నారు. స్వచ్చంద సేవకులు అందరు కూడా మార్చి 29 నుండి ఏప్రియల్ 10 వరకు సేవలు   అందించాలన్నారు.

లాటరీ ద్వారా సేవా ప్రదేశాల కేటాయింపు:

స్వచ్ఛంద సేవకులకు సేవా ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గతంలో వలె స్వచ్ఛంద సేవా బృందాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో సేవా ప్రదేశాలను కేటాయించారు.

 సమావేశములో ఉప కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, దేవస్థాన పరిపాలన, ఆలయ, ప్రజాసంబంధాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed