పకడ్బందీ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ డా. సామూన్
శ్రీశైలం, ఫిబ్రవరి 08:-శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా పకడ్బందీ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి,జాయింట్ కమిషనర్ అండ్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఏ ఒక్క చిన్న పొరపాటు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఉత్సవాల పటిష్ట నిర్వహణకు శ్రీశైలాలయాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు ఇంచార్జులుగా నియమించామని ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సంబంధిత జోనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా సంబంధిత అధికారులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని, ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున సాంకేతిక సమాచార లోపం తలెత్తకుండా టెలిఫోన్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను పెంచాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏరియా హాస్పిటల్ లో తాత్కాలిక బ్లడ్ బ్యాంక్, తాత్కాలికంగా ఏర్పాటు చేసే 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. కాలినడక ప్రాంతంలో సమాచార వ్యవస్థ లేని కారణంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జియో, బిఎస్ఎన్ఎల్ తదితర కమ్యూనికేషన్ అధికారులను కలెక్టర్ సూచించారు. కాలినడక భక్తులకు ప్రమాదవశాత్తు సమస్యలు వస్తే డోలీలు, స్ట్రేచర్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య, దేవస్థానం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాదయాత్రికులను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 24 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి 338 మంది గజ ఈతగాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, టూరిజం శాఖల నుండి తెప్పించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డిడిని, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 650 బస్సులు, తెలంగాణా నుండి 180 బస్సులు, కర్ణాటక ప్రాంతం నుండి 150 బస్సులు శ్రీశైల క్షేత్రానికి ప్రయాణికులను చేరవేస్తున్న సందర్భంగా మంచి కండిషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు మార్గమధ్యంలోని ముఖ్య కూడళ్ళ ప్రాంతాల్లో క్రేన్లు, అవసరమైన మెకానిక్‌లను ఏర్పాటు చేయాలని ఏపిఎస్ ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వసతి ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా దేవస్థాన గదులు మరియు ప్రవైటు సత్రాలలోని 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్‌డిఓను ఆదేశించారు. ఎక్కడా పారిశుద్ధ్యలోపం లేకుండా అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించుకుని శ్రీశైల ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిపిఓను, దేవస్థాన శానిటేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆత్మకూరు నుండి దోర్నాల వరకు రోడ్డు ప్యాచింగ్ మరమ్మతులు, రేడియం స్టిక్కర్లు, రోడ్డుకిరువైపులా మట్టితో చదును చేసే పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి ఈఈని కలెక్టర్ ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాలు నియంత్రించేందుకు లేబరు కమిషనర్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను టీమ్‌గా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని జోన్లకు నిరంతరాయ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఏపిఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న మాట్లాడుతూ భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌కు వివరించారు. 13వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం, 14వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, 15వ తేదీన ప్రభుత్వం తరుపున స్వామిఅమ్మవార్ల పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. భక్తులకు అందించే స్వామిఅమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను 30 లక్షల వరకు తయారు చేస్తున్నామన్నారు. ఈ నెల 18వతేదీ మహాశివరాత్రిపర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు.
జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ భారీ వాహనాలను అటవీమార్గంలో అనుమతించకుండా డైవర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నాగర్ కర్నూలు, కర్నూలు జిల్లాల ట్రాన్స్‌ఫోర్ట్, సంబంధిత ట్రాఫిక్ డిస్పీలను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలను నిలుపుదల చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి తాను, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. పాగాలంకరణ ముగిసిన వెంటనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు కైలాస ద్వారం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని కలెక్టర్, ఎస్పీలు సందర్శించి స్వయంగా భక్తులకు అన్నదాన వితరణ చేసారు. పాతాళ గంగ, ఆర్.టి. సి.బస్టాండ్, ఆగమ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లమ్మ మందిరం, కైలాస ద్వారం సమీప ఆవరణలలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలను వారు తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
Post Comment