శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ జరిపారు. తరువాత జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పమాల అర్పించారు.
అనంతరం దేవస్థానం రక్షణ సిబ్బంది , దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు.
ఆ తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనాన్ని చేశారు. అనంతరం జాతీయగీతం ఆలాపించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ప్రసంగిస్తూ గత సంవత్సర కాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు. తమ ప్రసంగంలో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టిందన్నారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధికి అనే త్రిముఖ వ్యూహంతో దేవస్థానం ముందుకెళ్ళడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవాలయములలో మౌలిక సదుపాయముల కల్పన,భక్తులకు ఇబ్బంది లేని దర్శనము, త్రాగు నీరు,మెరుగైన పారిశుద్ధ్యం, నాణ్యమైన ప్రసాదముల పంపిణీ మొదలైన అంశాలపై భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్‌ను IVRS పద్ధతి ద్వారా సేకరించి భక్తుల సంతృప్తి స్థాయిని అంచనా వేయడం జరుగుతోందన్నారు. మరోపక్క భక్తులకు అన్ని సేవలూ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం ద్వారా వారి సమయం వృథా కాకుండా అవసరమైన అన్ని సేవలను “మనమిత్ర” అనే వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానంలో దర్శనం , ఆర్జితసేవా టికెట్లు మనమిత్ర వాట్సప్ ద్వారా అందుబాటులో ఉన్నాయని , శ్రీస్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శనం , ఆర్జిత సేవా టికెట్లను ఈ మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించామని పేర్కొన్నారు. దేవస్థానం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ విధానంలో కూడా వీటిని పొందేవీలును కల్పించామని తెలిపారు. ఈ నెల 23వ తేదీన దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి ఆలయంలో వసంత పంచమి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ రోజురోజుకు క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భక్తుల రద్దీకనుగుణంగా ఆయా సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచడం జరుగుతోందన్నారు. క్షేత్రంలో మరింతగా మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు.
గణతంత్ర దినోత్సవంలో లిక్షితాశ్రీ నృత్యకళా నిలయం, నందికొట్కూరు దేశభక్తి గేయాలకు నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
కార్యక్రమం చివరలో కళాకారిణి కుమారి లిక్షితాశ్రీని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి సత్కరించారు.
