×

రఘును వెంటనే విడుదల చేయాలని నినదించిన జర్నలిస్టులు

రఘును వెంటనే విడుదల చేయాలని నినదించిన జర్నలిస్టులు

– డీజీపీకి వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు.
జర్నలిస్టు రఘు  అరెస్టును నిరసిస్తూ పలు జర్నలిస్టు సంఘాలు శుక్రవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద ఆందోళన చేపట్టాయి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీబీజేఏ), హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ (హెచ్ యూజే) తదితర జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలని, రఘు పై బనాయించిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, జర్నలిస్టు రఘు అరెస్టులో రౌడీల్లా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను, గిరిజనుల పోడు భూముల ఆక్రమణలను వెలికితీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టు రఘుపై అక్రమ కేసులు బనాయించి దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో పెడతారా? అని వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడున్న పాలకుల పాత్ర కంటే జర్నలిస్టుల పాత్ర ఎక్కువగా వుందన్న విషయం మరిచి పోయి జర్నలిస్టులను అణిచివేయడానికి పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. రఘును వెంటనే విడుదల చేయాలని, రఘుపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జర్నలిస్టుల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, పద్మనాభరావు, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, కార్యదర్శి ఏవీఎన్ రావు, సలీమా, కే. పాండురంగారావు, హెచ్ యూజే అధ్యక్షులు ఈ. చంద్రశేఖర్, కార్యదర్శి నిరంజన్, ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, టీబీజేఏ నాయకులు అనిల్ కుమార్, రాజమణి, కూకట్ పల్లి నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫెడరేషన్ ప్రతినిధి బృందం డీజీపీ కార్యాలయానికి వెళ్లి జర్నలిస్టు రఘు విడుదలకై డీజీపీ మహేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
print

Post Comment

You May Have Missed