భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా ప్రభుత్వం
“బతుకమ్మ సంబరాలు”
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బతుకమ్మ సంబరాలు” నేటి నుండి అంగరంగవైభవంగా రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన కావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘బొడ్డెమ్మ వైభవం’ అనే జానపద సంగీత నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. శ్రీ కల్లూరి వెంకటేశ్వర్లు రచన చేసి, దర్శకత్వం వహించిన ఈ సంగీత నృత్య రూపకం అందరిని ఎంతో ఆకట్టుకున్నది. చిన్నారులు ‘వినాయక విఘ్న వినాయక’ అనే వినాయక ప్రార్థనా గీతనృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గీతనృత్యానికి వీణ, శిరీష, అఖిల, నీలిమ చిన్నారుల గళం, వెంకట్ బృందం వారి వాద్యసహకారం, శంకర్ కీబోర్డ్, యాదగిరి డోలక్, జయప్రతాప్ ప్యాడ్ అందించారు.
‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో – బంగారు బొడ్డెమ్మ వలలో’
బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఎన్నియలో – బంగారు బొడ్డెమ్మ ఎన్నియలో’
‘బొడ్డెమ్మ పాటలు శ్రీలక్ష్మి – బొడ్డెమ్మ ఆటలు మహలక్ష్మి’
అంటూ చిన్నారులు నృత్యాలతో అలరించారు. వానలు కురిసి, చ్రువులు నిండితే పంటలు బాగా పండుతాయి. మా ఇంట శ్రీలక్ష్మి చేరుతుంది. బొడ్డెమ్మ పాటలు పాడి ఆడితే కోరుకున్న వరుడు వస్తాడని నమ్ముతారు.
పెళ్ళికాని అమ్మాయిలు బహుళ పంచమి నుండి పెత్రఅమాస వరకు తొమ్మిది రోజులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. బొద్దేమ్మను మట్టితో గోపురం ఆకారంలో చేసి పూలు, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించి ఇళ్ళముందు ఉంచి ఆటపాటలతో పూజించి అందరికి శుభం జరగాలని కోరుకుంటారు. ఈ విధంగా చిన్నారులు బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగల ప్రాముఖ్యతను తమ నృత్యరూపకం ద్వారా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డా. బండారు సుజాత శేఖర్, డా. సాయన్న, డా. పత్తిపాక మోహన్, డా. ఆర్. కమలగారు, సాంస్కృతిక శాఖ సూపరింటెండెంట్ రఘునందన్, అమీద్, ఆకుల రవి తదితరులు పాల్గొని, బతుకమ్మ వైభవం గురించి తెలియచేశారు.