శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు శనివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు నిర్వహించారు.మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు. సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
రావణ వాహనసేవ:
వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ ఘనంగా జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాల సమర్పణ:
సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి కూడా పాల్గొన్నారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు మంత్రికి , శాసనసభ్యులకు స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు మొదలైన కార్యక్రమాలు జరిగాయి.అనంతరం మంత్రి, శాసనసభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైలక్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.
ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి, దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.
దేవదాయశాఖ అదనపు కమిషనర్ ( ఎఫ్. ఎ.సి), చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పలువురు దేవస్థానం యూనిట్ అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.