శ్రీశైల దేవస్థానం:• శనివారం ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు జరిగాయి.
• ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ నిర్వహించారు.
• శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం జరిగాయి.
• ఉదయం 10.45 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సంప్రదాయబద్దంగా పంచాంగశ్రవణం జరిగింది.
• సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఘనంగా జరిగింది.
• రాత్రి 7.00 గంటలకు శ్రీ అమ్మవారికి రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారం మనోహరంగా ఉంది.
• రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ ప్రత్యేకం.
* Bhakti Sangeetha Vibhavari 2nd Programme At Pushkarini Stage . కె.వి.శ్రీనివాస్ అలియాస్ నిహాల్ కొండూరి & బృందం
(సంగీత దర్శకులు & సినీ నేపథ్యగాయకులు) హైదరాబాద్.
పంచాంగ శ్రవణం:
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం గం.10.45లకు ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగశ్రవణం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ , రాజమండ్రి వారు పంచాంగ శ్రవణం చేసారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.
తరువాత లోకక్షేమం కోసం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను జరిగాయి.
స్వామిఅమ్మవార్ల పూజాదికాల తరువాత నూతన పంచాంగానికి కూడా పూజాదికాలు చేసారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థానం తరుపున ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టేవీరభద్ర దైవజ్ఞ వారికి శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి పంచాంగ పఠానికి ఆహ్వానించారు.
తరువాత ఆస్థాన సిద్ధాంతి శుభకృత్ నామ సంవత్సర విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా ప్రజలు వృద్ధిలోకి వస్తారన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశపు ఖ్యాతి పెరుగుతుందన్నారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయన్నారు. దేశమంతటా కూడా మంచి వర్షాలు కురుస్తాయని అన్నారు.చాలా ప్రాంతాలలో సగటువర్షపాతం నమోదవుతుందన్నారు. ఈ సంవత్సరములో ఋతుపవనాలు సరైన సమయములో ప్రవేశిస్తాయని, జలాశయాలలో నీరు సమృద్ధిగా ఉంటాయన్నారు.అల్పపీడన తుఫాన్ ప్రభావాలు కూడా అధికంగా ఉండే సూచనలు ఉన్నాయన్నారు.పంటలు సంపూర్ణంగా ఫలిస్తాయన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి బాగుంటుందన్నారు. ముఖ్యంగా గోధుమలు, ఉలవలు, వేరుశనగ, కాయ ధాన్యాలు, మిర్చి, పొగాకు, ఫలజాతులు, శనగలు, బాగా పండుతాయన్నారు. తెలుపు, ఎరుపు పొట్టి ధాన్యాలు సమృద్ధిగా పండే అవకాశాలు ఉన్నాయన్నారు. పాడి పరిశ్రమ బాగుంటుందన్నారు.పర్యావరణానికి సంబంధించి దేశమంతటా కూడా మొక్కలు నాటే కార్యక్రమం అమలు అవుతుందన్నారు.ఇక ఈ సంవత్సరము వేసవిలో దేశమంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయన్నారు. పలుచోట్ల వేసవితాపం అధికంగా ఉంటుందని, వడగాల్పులు అధికంగా వీస్తాయన్నారు. అయితే త్రాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. వేసవిలోనే తొలకరి వానలు ప్రారంభమవుతాయన్నారు.ఈ సంవత్సరం ప్రణీతానదికి పుష్కరాలు వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.