శ్రీశైల దేవస్థానం: ఉగాది పర్వదినం రోజైన ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్యపూజలు జరిపారు. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు.
అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేశారు. సాయంత్రం 5.30గంటలకు సాయంకాల పూజలు, జపానుష్ఠానములు జరిపారు.
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్ల రథోత్సవం జరిపారు.
రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిగాయి.
రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్వికబలిగా సమర్పించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపారు. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
కాగా రథోత్సవం సందర్భంగా రథానికి విశేషంగా పుష్పాలంకరణ చేశారు.
రథోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గొరవనృత్యం తదితర కళారూపాలను ఏర్పాటు చేశారు.
రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారం:.
శ్రీ అమ్మవారి అలంకారాలలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం, అలంకారమూర్తికి విశేషపూజలు
జరిగాయి.చతుర్భుజాలను కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ప్రత్యేకం.
ఈ దేవిని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
* శ్రీశైల దేవస్థానం: *పంచాంగ శ్రవణం*
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10.00 గంటలకు ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమము
జరిగింది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు కార్యక్రమములో పాల్గొన్నారు.
శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ, రాజమండ్రి పంచాంగ పఠనం చేసి పంచాంగ శ్రవణం చేయించారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
మహాగణపతిపూజ జరిపారు.. తరువాత లోకక్షేమం కోసం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలను నిర్వహించారు.
స్వామిఅమ్మవార్ల పూజాదికాలు తరువాత నూతన పంచాంగానికి కూడా పూజాదికాలు జరిపారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి దేవస్థానం తరుపున ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టేవీరభద్ర దైవజ్ఞ వారిని నూతన వస్త్రాలతో సత్కరించి శ్రవణానికై ఆహ్వానించారు.
తరువాత ఆస్థాన సిద్ధాంతి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సర విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉంటుందన్నారు. పంటలు బాగా పండుతాయని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. జనులందరికీ క్షేమ, ఆరోగ్యాలు కలుగుతాయన్నారు. పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు.గోధుమ, శనగ ధాన్యాలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయన్నారు. ఎర్రనేలలోని పంటలు కూడా బాగా పండుతాయన్నారు. వరి, వేరుసెనగ, చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనెగింజలకు ధరలు పెరగవచ్చునన్నారు.
రక్షణ రంగానికి నిధులు బాగా కేటాయించబడుతాయన్నారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారతదేశ ఖ్యాతి పెరుగుతుందన్నారు. రాష్ట్రాలలోని పలురంగాలలో వృద్ధిరేటు పెరుగుతుందన్నారు. ద్రవ్యల్బణం తగ్గకపోవచ్చునన్నారు. బంగారు, వెండి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. విదేశీ వ్యవహారాలు బాగా ఉంటాయన్నారు. క్రీడా రంగంలో మంచి విజయాలు ఉంటాయన్నారు.
ఈ సంవత్సరం మనదేశంలో రెండు చంద్ర గ్రహణాలు కనిపిస్తాయన్నారు. భాద్రపద పౌర్ణిమ ( 07.09.2025) రోజున సంపూర్ణ చంద్రగ్రహణం, ఫాల్గుణ పౌర్ణమి ( 03.03.2026) గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందన్నారు.
ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ఉంటాయన్నారు.