
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (15.01.2022) మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలో ( శివవీధిలో) ఈ పోటీలు ఏర్పాటు చేయగా మొత్తం 25 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అందరికీ అవగాహన కలిగించాలనే భావనతో ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. పోటీలలో పాల్గొన్న మహిళలందరు మాడవీధిలో వారు వేసే ముగ్గులను శ్రీస్వామి అమ్మవార్ల కైంకర్యంగా భావించాలన్నారు.
ఈ పోటీలకు దేవస్థానం పర్యవేక్షకులు శ్రీమతి కె. సాయికుమారి, శ్రీమతి హిమబిందు, సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి శశిదేవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
పోటీలలో శ్రీమతి జె. ఆర్. అపర్ణ, శ్రీమతి. జి. లక్ష్మీదేవి, ఎస్. హరిత శ్రీశైలం వారు వరుసగా మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులు పొందారు.
కార్యనిర్వహణాధికారివారి చేతుల మీదుగా ఈ బహుమతులు అందించారు.
కన్సోలేషన్ బహుమతులలో భాగంగా నాగలక్ష్మి ,శ్రీమతి వెంకటసబ్బమ్మ శ్రీశైలం వారు వరుసగా మొదటి, రెండవ బహుమతులను పొందారు.
విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పోటీలో పాల్గొన మహిళలందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా రవిక వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమలను, దేవస్థానం క్యాలెండరు అందజేసి సత్కరించారు.
కాగా భారతీయ సంప్రదాయంలో రంగవల్లులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పురాణాలలో పలుచోట్ల ఈ ముగ్గులు ప్రస్తావించబడ్డాయి. ముగ్గును శుభానికి, మంగళత్వానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించే అంశాలలో ఇంటిముంగిట రంగవల్లులను తీర్చిదిద్దడం కూడా ఒకటి.
ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు డా. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీరు సుబ్బారెడ్డి, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.